అఖిల భారత సర్వీసు 2025 ఫైనల్ ఫలితాల్లో రాణించిన తెలుగు అభ్యర్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం‘ పథకం ద్వారా సాయం అందుకున్న తెలంగాణ అభ్యర్థుల్లో 20 మంది సివిల్స్ తుది ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజేతలుగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేదల బిడ్డలు బర్లు, గొర్లు కాసుకుని బతకాలని భావించింది. మన ప్రభుత్వం వారి విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఐఎఎస్ లు, ఐపీఎస్ లు గా ఎదగాలని తోడుగా నిలుస్తోందని సీఎం రేవంత్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కొత్తగా అఖిల భారత సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులు దేశ ప్రగతిలో భాగస్వాములై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏ కేడర్ లో ఉన్నా తెలంగాణ పునర్నిర్మాణంలో వారి వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.