ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల మధ్య హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో అట్టహాసంగా జరిగింది. చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ సినిమా వేడుకలో కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ ఖుషీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తనలోని కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. ఈ వేడుకలో ప్రముఖ యాంకర్ సుమ పవన్ కళ్యాణ్‌తో సరదా చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అడిగిన ఒక ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం మొత్తం ఈవెంట్‌కి హైలైట్ గా నిలిచింది. “అప్పట్లో మీ ప్యాషన్ బైక్స్ అన్నారు… ఇప్పుడు మీ ప్యాషన్ ఏంటి సర్?” అని సుమ ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ వెంటనే నవ్వుతూ స్పందించారు.
“అప్పట్లో అంటే 1940స్ లేదా 1960స్ అనుకుంటున్నారా?” అంటూ ఆయన సరదాగా ఎదురు ప్రశ్నించారు. ఆ వెంటనే తనదైన స్టైల్లో మాట్లాడుతూ, “మీరు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే నేను 1950లలో సినిమాలలో రాజ్ కపూర్ తో కలిసి నటించినట్టు ఉంది. ఇంకా ఎస్.వీ.ఆర్, ఎన్టీఆర్, కన్నాంబ లాంటి లెజెండ్స్‌తో కలిసి కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు” అంటూ సుమపై సరదాగా పంచ్‌లు వేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాటలు వినగానే అక్కడున్న అభిమానులు, సినీ ప్రముఖులు నవ్వులతో గ్రౌండ్ ని మార్మోగించారు. ఇంకా మాట్లాడుతూ, “సుమ గారు నన్ను మెల్లిగా బీసీ యుగానికి తీసుకెళ్తున్నారు. ఈ మధ్యనే నా OG సినిమా వచ్చింది అనే విషయాన్ని కూడా మర్చిపోయినట్టు ఉంది” అంటూ మరోసారి చమత్కరించారు. “నేను రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను ఇలా వెనక్కి నెట్టేయడం సరికాదు. ఈ విషయం నేను బల్లగుద్ది చెప్పాలి” అంటూ ఆయన సరదాగా చెప్పిన మాటలు అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచేశాయి. పవన్ కళ్యాణ్ తన ప్రసంగం మధ్యలో కూడా ఇలాంటి ఫన్నీ కామెంట్స్ చేస్తూ వేదికను ఉత్సాహంగా మార్చేశారు. “సుమ గారు చెప్పినట్టు… చాలా దశాబ్దాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం… లేదా శతాబ్దాల క్రితం నేను చాలా సినిమాలు చేస్తున్నప్పుడు… అప్పుడు మర్చిపోయిన నా భావనను ఈ సినిమాలో దర్శకుడు మళ్లీ తీసుకొచ్చాడు” అంటూ మరోసారి సరదాగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాటలు అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు, ప్రోమోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ సినిమాను ఒక మాస్ పండుగలా థియేటర్లలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.