ఇది భారత్ దౌత్య వ్యూహం…92 వేల టన్నుల LPGతో భారత్ కు 2 నౌకలు

Spread the love

భారత ఇంధన భద్రతకు సవాలుగా మారిన వేళ తన దౌత్య వ్యూహంతో మొండి పట్టు వీడకుండా పోరాడింది. దీంతో హార్మూజ్ జలసంధిలో చిక్కుకున్న భారత నౌకల విముక్తి దిశగా తొలి అడుగు పడింది. రెండు భారీ ఎల్పీజీ ట్యాంకర్లు సురక్షితంగా భారత తీరానికి బయలుదేరాయి. పర్షియన్ గల్ఫ్ నుండి బయలుదేరిన ‘పైన్ గ్యాస్’, ‘జాగ్‌ వసంత్’ నౌకలు లరాక్-కేష్మ్ ఛానెల్ ద్వారా ప్రయాణించాయి. ఈ క్రమంలో ఇరాన్ అధికారులకు తమ పూర్తి వివరాలను వెల్లడించి, ఎటువంటి అడ్డంకులు లేకుండా సురక్షితంగా బయటపడ్డాయి. ఈ రెండు నౌకలు తీసుకువస్తున్న 92,000 టన్నుల గ్యాస్ భారత్‌కు రెండు రోజుల్లో చేరుకోనుంది. ఇప్పటికే MT శివాలిక్, MT నందా దేవి నౌకలు ముంద్రా, కాండ్లా పోర్టులకు చేరిన సంగతి తెలిసిందే. భారత్ తన ఇంధన భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. తాజాగా పోర్టులు, షిప్పింగ్ , జలమార్గాల మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, దేశ వంటగ్యాస్ అవసరాలను తీర్చే క్రమంలో భారీ నౌకలు భారత్ వైపు పయనమయ్యాయి. ఘర్షణల వలన సముద్ర రవాణాకు ఆటంకాలు ఏర్పడినప్పటికీ, భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే కాకుండా, సప్లై చైన్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగానే, తదుపరి రెండు రోజుల్లో ఈ కీలక నౌకలు భారత తీరానికి చేరుకోనున్నాయి.  ఈ భారీ ఆపరేషన్ వెనుక గత కొన్ని రోజులుగా నిరంతర కృషి జరుగుతోంది. ఈ ప్రతిష్టంభనను భారత్ తన దౌత్య మరియు వ్యూహాత్మక బలంతో అధిగమించింది.హార్మూజ్ జలసంధి సంక్షోభం, ఇప్పుడు భారత నౌకల భద్రతపై ఉత్కంఠను పెంచుతోంది. సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో మొత్తం 28 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. వీటిలో 24 నౌకలు పశ్చిమ సెక్టార్‌లో ఉండగా, 4 నౌకలు తూర్పు వైపున నిలిచిపోయాయి.ప్రస్తుతానికి కొన్ని నౌకలు సురక్షితంగా బయటపడినప్పటికీ, ఇంకా 22 నౌకలు పశ్చిమ ప్రాంతంలోనే వేచి చూస్తున్నాయి. సుమారు 600 మంది భారతీయ నావికులు ఈ నౌకల్లో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. ఇప్పటికే 11 మంది నావికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.చిక్కుకుపోయిన వాటిలో ఎల్పీజీ (LPG), ఎల్ఎన్జీ (LNG), క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో పాటు కంటైనర్ ,  బల్క్ క్యారియర్ వంటి కీలక రవాణా నౌకలు ఉన్నాయి. అటు ఇరాన్ అధికారులు ప్రతి నౌకను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా నౌక యాజమాన్యం, అందులోని సరుకు,  అమెరికాతో ఆ నౌకకు ఎలాంటి సంబంధాలు లేవని ధృవీకరించుకున్న తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ వ్యవహారంలో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తోంది. నౌకల్లో ఉన్న సిబ్బందికి సరిపడా ఆహారం, మంచినీటి సరఫరా అందుబాటులో ఉందని అధికారులు స్పష్టం చేశారు. మన నావికులను, నౌకలను క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. హార్మూజ్ జలసంధి భారత్ కు కీలక ఇంధన రవాణా కారిడార్ గా ఉంది. భారత్ తన ముడి చమురులో దాదాపు 88 శాతం, సహజ వాయువులో 50 శాతం, ఎల్పీజీలో 60 శాతం ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ ట్యాంకర్ల సురక్షిత ప్రయాణం భారత్ ఇంధన భద్రతకు సానుకూల పరిణామంగా చెప్తారు. సవాళ్లు ఎన్ని ఎదురైనా దేశ ప్రయోజనాలే పరమావధిగా భారత్ ముందుకు సాగుతోంది. అడ్డంకులను అధిగమించి ఇంధన భద్రతను కాపాడటంలో పైచేయి సాధించింది. ఈ రెండు ట్యాంకర్ల సురక్షిత ప్రయాణం భారత్ ఇంధన భద్రతపై నెలకొన్న సందిగ్దతను కొంతవరకు తొలగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *