50 ఏళ్లకు పైగా నిరీక్షణకు తెరపడింది. మరోసారి మానవాళి చారిత్రక విజయాన్ని సాధించి సత్తా చాటింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ప్రయోగించిన ఆర్టెమిస్-2 ట్రిప్ విజయవంతంగా పూర్తయింది. చంద్రుడిని చుట్టేసిన ఆర్టెమిస్-2 తిరిగి సురక్షితంగా భూమికి చేరుకుంది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాండియాగో తీరంలో ఆస్ట్రోనాట్ లు ఉన్న ఒరాయన్ క్యాప్సుల్ ల్యాండ్ అయింది. మన దేశ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5.38 గంటలకు ఆస్ట్రోనాట్ లు సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. దీంతో పది రోజుల యాత్ర విజయవంతంగా పూర్తయింది. భూమి వాతావరణంలోకి ఒరాయన్ క్యాప్సూల్ అత్యంత వేగంగా దూసుకొచ్చింది. అనంతరం మూడు భారీ పారాచూట్ల సాయంతో ఆస్ట్రోనాట్ లు పసిఫిక్ జలాల్లో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలను నాసా విడుదల చేసింది. ఈసందర్భంగా నాసా ఆస్ట్రోనాట్ లకు స్వాగతం పలుకుతూ ఎక్స్ లో ఓ పోస్టు చేసింది. చారిత్రాత్మక 10 రోజుల మిషన్ విజయవంతమైనట్లు తెలిపింది. భూమి నుండి అత్యంత దూరం ప్రయాణించిన మానవ సహిత స్పేస్ టూర్ గా ఆర్టెమిస్-2 రికార్డు సృష్టించింది. చంద్రుడి వద్దకు మనుషులను పంపే ఉద్దేశంతో అమెరికా అంతరిక్ష సంస్థ – నాసా ఈనెల 1న ఈ ఆర్టెమిస్-2 (Artemis 2)ను ప్రయోగించింది. ఈ యాత్రలో అమెరికా ఆస్ట్రోనాట్ లు రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సన్లు ఉన్నారు. ఇప్పటివరకు మనుషులు ఎవరూ కూడా వెళ్లలేని 4,06,771 కిలోమీటర్ల దూరానికి వీరు ప్రయాణించి సత్తా చాటారు. అపోలో-13 రికార్డును కూడా ఈ ఆర్టెమిస్ అధిగమించడం విశేషం. ఈ యాత్రలో చంద్రుని మరొక వైపు దృశ్యాలు, సంపూర్ణ సూర్యగ్రహణం వంటి వాటిని ప్రపంచానికి చూపారు.