ఆ ట్రాప్ లో పడొద్దు…శ్రేణులకు కూటమి సంయుక్త ప్రకటన 

Spread the love

కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషయంపై ఎట్టకేలకు ఏపీ కూటమి ఉమ్మడి ప్రకటన చేసి తమ శ్రేణులకు కీలక సందేశాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఇటీవల మన పార్టీ అభిమానులు, కార్యకర్తల ముసుగులో ప్రత్యర్థి పార్టీ ఫేక్ అకౌంట్లు, సూడో అభిమానులుగా వ్యవహరిస్తున్న విషయం దృష్టికి వచ్చిందని  వీరు ఒక పార్టీకి అభిమానుల్లా నటిస్తూ, మరో మిత్రపక్ష నాయకులను తీవ్రంగా విమర్శించడం, వ్యక్తిగతంగా దూషించడం లేదా వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు, కామెంట్లు చేస్తున్నారని అప్రమత్తం చేసింది.ఉదాహరణకు, టీడీపీ అభిమానిలా కనిపించే ఒక ఫేక్ అకౌంట్ చంద్రబాబుని పొగుడుతూనే పవన్ కళ్యాణ్ ని విమర్శించవచ్చు. జనసేన అభిమానిలా కనిపించే ఫేక్ అకౌంట్ చంద్రబాబుని విమర్శించవచ్చు. దీంతో అసలైన కార్యకర్తలు ఆవేశానికి లోనై మిత్రపక్షాలపై పరస్పరం దాడులకు దిగుతున్నారు. చివరకు మనలో మనమే గొడవపడుతూ, వైసీపీకి రాజకీయంగా, ప్రయోజనం కల్పిస్తున్నాం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టి, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో, మనలో మనమే విభేదాలు సృష్టించుకోవడం మిత్ర ధర్మానికి విరుద్ధమని కూటమి తన ప్రకటనలో పేర్కొంది.  ఈ పరిస్థితికి ముగింపు పలికేందుకు మూడు మిత్రపక్షాల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకుంది. ఇకపై టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా మిత్రపక్ష నాయకులపై, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు, పరస్పర కక్షపూరిత ప్రచారానికి పాల్పడితే, వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. 

అయితే తమ  ప్రధాన ఉద్దేశ్యం సూడో వ్యక్తులను గుర్తించి. వారి కుట్రలను అడ్డుకోవడం. అందుకు ముందుగా అసలైన అభిమానులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించింది.  అనుమానాస్పద పోస్టులు లేదా కామెంట్లు కనిపిస్తే వెంటనే స్పందించకుండా పార్టీల దృష్టికి తీసుకురావాలని  వాటిపై పార్టీలు తగిన చర్యలు తీసుకుంటాయన్నారు.  ఇకపై మిత్రపక్షాలపై మితిమీరిన విమర్శలు, వ్యక్తిగత దాడులు, దూషణలకు ఎవరూ పాల్పడవద్దని సంయమనం వహించి కూటమి ఐక్యత ను బలోపేతం చేయాలని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి. సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రజలకు వాస్తవాలను స్పష్టంగా వివరించి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపింది. మొత్తానికి ఇంకా పరిస్థితి శృతి మించకముందే స్పందించారని కూటమి అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *