ఎన్టీఆర్ కు విజయవంతంగా పూర్తైన సర్జరీ 

Spread the love

తెలుగు అగ్రనటులలో ఒకరైన ఎన్టీఆర్ కు తాజాగా సర్జరీ జరిగింది. ఈ సర్జరీ విజయవంతంగా జరిగిందని ఆయన పూర్తిగా కోలుకుంటారని కిమ్స్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ ప్రకటించింది. వివారాల్లోకి వెళితే ఎన్.టి.ఆర్ భుజానికి ఇటీవల ఒక చిన్న గాయమైంది. వైద్యుల బృందం ఆయనను పరిశీలించి, త్వరగా కోలుకోవడానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు లతో కూడిన వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బాగున్నారు. వైద్యుల సంరక్షణలో ఆయనకు తగిన విశ్రాంతి, ఫిజియోథెరపీ అందిస్తున్నారు. రాబోయే 2 నుండి 3 నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.ఈ మధ్య కాలంలో పలువురు ప్రముఖ తెలుగు హీరోలు సర్జరీలు చేయించుకోవడం వార్తల్లో నిలిచింది. పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీనియర్ హీరో బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కూడా సర్జరీలు చేయించుకున్నారు. తమ అభిమాన నటులు ఇలా సర్జరీలు చేయించుకోవడం పట్ల సోషల్ మీడియా వేదికగా అభిమానులు త్వరగా తమ హీరోలు కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అలాగే తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కథా నేపథ్యంలో సినిమా చేయనున్నారు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న‘డ్రాగన్’ సినిమా జూన్ 11, 2027న విడుదల కానుంది. ఈ సినిమాలోని తారక్ పాత్ర లూగర్. చూస్తుంటే, ఒక భారీ యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ నీల్ కసిగా పనిచేస్తున్నట్లు అర్థమవుతోంది. మే 20, 2026న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అది సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ రఘువీర్ రాథోడ్ పాత్రలో, రుక్మిణి వసంత్, బిజు మీనన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇక ‘డ్రాగన్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా కుమార స్వామి నేపథ్యంతో తెరకెక్కనుంది. త్రివిక్రమ్ తనదైన స్టైల్‌లో కథలను రూపొందించడంలో దిట్ట. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక అంశాన్ని ఎంచుకోవడం సినీ ప్రియులను ఆశ్చర్యపరిచింది. ఇది గతంలో వచ్చిన కొన్ని పౌరాణిక, భక్తి రస చిత్రాల జాబితాలో నిలుస్తుందా, లేక త్రివిక్రమ్ దీనికి ఒక కొత్త కోణం ఇస్తాడా అని వేచి చూడాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *