భారత నౌకాదళంలోకి పవర్ ఫుల్ వెపన్..?

Spread the love

హిందూ మహాసముద్రంలో ఇతర దేశాల నౌకాదళాల కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతున్న వేళా భారత నౌకాదళం  తన దాడి సామర్థ్యాలను అమాంతం పెంచుకునే దిశగా సంచలన అడుగులు వేస్తోంది. సముద్రంలో శత్రు దేశాల ఆటకట్టించేందుకు, మన దేశ భద్రతను శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక సరికొత్త, అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని మన అమ్ములపొదిలోకి చేర్చడానికి సిద్ధమైంది. భారత నేవీ కొనుగోలుకు శ్రీకారం చుట్టిన ఈ సరికొత్త ఆయుధం పేరు మీడియం రేంజ్ లోయిటరింగ్ మ్యూనిషన్ . సముద్ర గర్భంలో శత్రు దేశాల గుండెల్లో నిద్రపోయేందుకు రక్షణ శాఖ దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ జారీ చేసింది. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధనౌకలు, తీర ప్రాంత సైనిక స్థావరాలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగల అద్భుతమైన సామర్థ్యం దీనికి ఉంటుంది. ఈ మానవరహిత విమానం పరిమాణంలో చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ దీని ఇంపాక్ట్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది. ఇది గరిష్ఠంగా రెండున్నర మీటర్ల పొడవు, దాదాపు 3 మీటర్ల రెక్కల వెడల్పు కలిగి ఉంటుంది. వార్ షిప్ పై  ఇది ఎక్కువ స్థలం ఆక్రమించకుండా ఉండేలా.. దీనిని ఒక ప్రత్యేకమైన పెట్టెలో ఉంచి, డ్రైవింగ్‌లో సహాయపడే వ్యవస్థ సాయంతో నేరుగా నౌక నుంచే గాల్లోకి పంపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో నౌకకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా దీనిని వెంటనే బయటకు తొలగించే ప్రత్యేక వ్యవస్థ కూడా ఇందులో ఉంటుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో  రూపొందించనున్న ఈ ఆయుధాలకు కనీసం 10 సంవత్సరాల లైఫ్ టైమ్  ఉండేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. 

ఈ ఆయుధంలోని మరో ప్రత్యేకత స్వార్మ్ సామర్యం’. ఒకే యాక్షన్ పాయింట్ నుంచి.. కేవలం ఒక్క వ్యక్తి ఏకకాలంలో ఏకంగా 10 మానవరహిత విమానాలను ఒకేసారి నియంత్రించగలిగేలా దీనిని డెవలప్ చేస్తున్నారు. అంటే ఒకేసారి శత్రువుల పది వేర్వేరు లక్ష్యాలపై నిఘా పెట్టడంతో పాటు, అవసరమైన సమయంలో వాటన్నింటిపై ఒకేసారి దాడి చేసే అవకాశం మనకు దక్కుతుంది. దీనికంటే ఆసక్తికరమైన విషయం మరొకటి ఉంది. ఒక యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ఈ విమానాన్ని ఆకాశంలో ఉండగానే.. సముద్రంలో మరోచోట ఉన్న మన రెండో యుద్ధనౌక నియంత్రణకు అప్పగించవచ్చు. అంటే ఒక నౌక నుంచి బయలుదేరిన ఆయుధాన్ని, మన అవసరాన్ని బట్టి వేరొక నౌక నుంచే ఆపరేట్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ నిజంగా భారత నేవీకి ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. సముద్రంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే ఈ ఆయుధాన్ని మైనస్ 20 డిగ్రీల నుంచి 60 డిగ్రీల  సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో, 95 శాతం తేమలో, అలాగే గంటకు 90 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచే ప్రచండ గాలుల్లోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా నేవీ నౌక డెక్ నుంచి ప్రయోగించగలిగేలా రక్షణ శాఖ దీని రూపకల్పన చేస్తోంది. ఈ ప్రాజెక్టును రక్షణ మంత్రిత్వ శాఖ భారతీయ రూపకల్పన, అభివృద్ధి విధానం కింద చేపడుతోంది. సైజ్ చిన్నదైనా ఇంపాక్ట్ పెద్దదిగా ఉండే ఈ మానవరహిత ఆయుధాలు.. సముద్ర యుద్ధంలో భారత శక్తిని మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *