ఆత్మనిర్భరత – తక్షణ అవసరాల మధ్య సమతౌల్యం

Spread the love

భారత రక్షణ రంగం ప్రస్తుతం ఒక కీలకమైన చారిత్రక సంధిగ్ధ దశను ఎదుర్కొంటోంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మన సైనిక శక్తి ఎంతటిదో ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. అలాగే భారత్ ‘ఆత్మనిర్భర్’ లక్ష్యంతో స్వదేశీ ఆయుధ తయారీపై పూర్తి దృష్టి పెట్టడంతో పాటు రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం దీర్ఘకాలికంగా అత్యంత సరైన నిర్ణయమే అయినప్పటికీ సమీప భవిష్యత్తులో మనముందు ఎన్నో తీవ్రమైన సవాళ్లు నిలబడి ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ విమానాల కొరత, మన స్థానిక తయారీ సంస్థల పరిమితులు, సరిహద్దుల వెంబడి పాకిస్తాన్, చైనా దేశాల నుంచి పెరుగుతున్న ముప్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వైమానిక దళాన్ని బలోపేతం చేసే క్రమంలో పాతపడిన మిగ్‌ విమానాలను నిలిపివేయడంతో మనం ఇప్పుడు సుమారు 150  కొత్త యుద్ధ విమానాల అత్యవసర కొరతను ఎదుర్కొంటున్నాం. ఇప్పటికప్పుడు సమీకరణ ప్రక్రియ మొదలుపెట్టినా ఈ విమానాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి సమయం  పట్టే అవకాశం ఉంది. అమెరికా, రష్యా తయారీ విమానాలను మన సైన్యం రకరకాల కారణాలతో తిరస్కరిస్తుండగా ఫ్రాన్స్‌ నుంచి రావాల్సిన రఫేల్ విమానాల డెలివరీలో కూడా తీవ్రమైన ఆలస్యం జరుగుతోంది. అయితే మన శత్రుదేశాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నప్పటికీ ఊహించని సవాళ్లు ఎదురైతే  మన దేశం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వదేశీ ఉత్పత్తిని పెంపొందించడం ఎంత ముఖ్యమో, ప్రస్తుతం సైన్యానికి తక్షణమే కావలసిన అవసరాలను తీర్చడం కూడా అంతే ముఖ్యం. విమానాల సమీకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయడంతో పాటు, మన స్థానిక తయారీ రంగ సామర్థ్యాన్నిమరింత పెంచాలి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఏమాత్రం తడబడకుండా నమ్మకమైన మిత్రదేశాల నుంచి తాత్కాలిక సరఫరాలను సమకూర్చుకోవడం చాలా కీలకం. అలాగే పూర్తిగా దేశీయతపైనే ఆధారపడి ప్రస్తుత రక్షణ అవసరాలను విస్మరిస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. గతంలో మన దేశం ఎన్నో కఠినమైన భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని తిరుగులేని విజయాలతో బయటపడింది. అయితే ప్రస్తుత రక్షణ రంగంలోని లోపాలను క్షణం ఆలస్యం చేయకుండా గుర్తించి, వాటిని యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దుకుంటేనే భవిష్యత్తులో వచ్చే ముప్పులను మనం సమర్థంగా నిలువరించగలం. రక్షణ రంగంలో ఒక్క క్షణం జరిగే ఆలస్యం కూడా దేశానికి అత్యంత ఖరీదైన మూల్యాన్ని తెచ్చిపెట్టవచ్చు. అందువల్ల తక్షణ అవసరాలు మరియు దీర్ఘకాలిక స్వదేశీ లక్ష్యాల మధ్య సరైన సమతౌల్యతను సాధిస్తూ మన సైనిక శక్తిని తిరుగులేని విధంగా కాపాడుకోవడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.  ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్వదేశీ ఆయుధాల తయారీతో భారత్ భవిష్యత్తు కోసం గట్టి పునాదులే వేస్తోంది. కాకపోతే రక్షణ రంగంలో స్వదేశీ లక్ష్యాలతో పాటు తక్షణ అవసరాలను కూడా సమన్వయం చేసుకుంటూ, మన సైనిక శక్తిని తిరుగులేని విధంగా కాపాడుకోవడమే ఇప్పుడు మనముందున్న అసలైన విజయం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *