స్థానిక సంస్థల  ఎన్నికలపై వైసీపీ గురి…శ్రేణులకు జగన్ దిశానిర్దేశం 

Spread the love

ఆంధ్రప్రదేశ్ లో ఇక ఇప్పుడు అందరి దృష్టీ స్థానిక సంస్థల ఎన్నికల  పైనే పడింది. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పట్టు సాధించేందుకు అటు అధికార టీడీపీ జనసేన బీజేపీ  కూటమి, ఇటు ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలకు పదును  పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  తన పార్టీ నేతలకు ఒక సంచలన వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కీలక నేతలతో ఆయన అత్యవసర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏకగ్రీవాలపై  జగన్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.   ఈ సమావేశంలో జగన్ తీసుకున్న అత్యంత కీలకమైన, కఠినమైన నిర్ణయం ఏకగ్రీవాల  గురించే. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను భయపెట్టి, నామినేషన్లు వేయనివ్వకుండా ఏకగ్రీవాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి వైసీపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని జగన్ స్పష్టం చేశారు.  ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా అధికార పక్షానికి ఏకగ్రీవాలకు ఆస్కారం ఇవ్వకూడదని ఆయన గట్టిగా తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా భయపడి లేదా ప్రలోభాలకు లొంగి ఏకగ్రీవాలు జరగనిస్తే.. ఆయా నియోజకవర్గాల వైసీపీ కో-ఆర్డినేటర్లు తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో   పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కాలేరని బహిరంగంగానే హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారనే దానిపై ఎన్నికల అనంతరం తాను ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటానని ఆయన నేతలకు తెలిపారు. 

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్ల ఎన్నికలు. ఇవి పూర్తిగా గ్రామస్థాయిలో పార్టీ కోసం జెండా మోసే కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు. అందుకే జగన్ ఒక పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పారు.  కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే.. రేపు మన ఎమ్మెల్యే ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారు అని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగనివ్వకుండా అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు, ప్రలోభాలకు పాల్పడినా సరే, పార్టీ నాయకుడు కచ్చితంగా కార్యకర్త వెన్నంటే ఉన్నాడనే భరోసా ప్రతి ఒక్కరికీ కల్పించాలని సూచించారు. ఇప్పుడు కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిస్తే.. భవిష్యత్‌ సాధారణ ఎన్నికల్లో వారు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తారని జగన్ తన కో-ఆర్డినేటర్లకు వివరించారు. 

ఇదే సమావేశంలో మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మేయర్ లాంటి పదవులకు ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని చేస్తున్న ఆలోచనపై కూడా జగన్ స్పందించారు. నిజానికి ఈ ప్రత్యక్ష ఎన్నికల విధానం తమకు ఒక రకంగా అనుకూలమేనని ఆయన అభిప్రాయపడ్డారు. మేయర్ లేదా జడ్పీ చైర్మన్ లాంటి ప్రధాన పదవులకు ఒక బలమైన, ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న అభ్యర్థిని బరిలోకి దింపాలని నాయకులకు సూచించారు. అలా ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే, ఆ నాయకత్వంలో కింద పోటీ చేసే ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు కూడా నైతికంగా బలం లభిస్తుందని, పోరాడే ధైర్యం వస్తుందని జగన్ ఒక వ్యూహాత్మక సలహా ఇచ్చారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా పోరాడితేనే  ప్రజలు కచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో  కార్యకర్తలు ఎవరూ నామినేషన్ వేయడానికి ముందుకు రాని పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? దీనికి కూడా జగన్ ఒక కఠినమైన పరిష్కారం చెప్పారు. అలాంటప్పుడు అవసరమైన చోట నియోజకవర్గ ఇంచార్జులు లేదా కో-ఆర్డినేటర్లు తమ సొంత కుటుంబ సభ్యులను సైతం పోటీలోకి దింపేందుకు అస్సలు వెనకాడవద్దని ఆయన సంచలన సూచన చేశారు.  దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే.. ప్రతిపక్షం భయపడి పారిపోయిందనే ముద్ర పడకూడదు. ప్రజల గొంతు అసెంబ్లీలో, బయట వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా కల్పించేలా ప్రతి స్థానంలోనూ పోటీ కచ్చితంగా జరగాల్సిందేనని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *