సరిహద్దుల్లో ఆపరేషనల్ రెడీనెస్ ను ఇండియన్ ఆర్మీ మరోసారి చాటింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్–బార్మేర్ సెక్టార్లో భారత్‌మాల హైవేపై అపాచీ, రుద్ర హెలికాప్టర్ల ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్స్ నిర్వహించింది. భారత్–పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో జరిగిన ఈ విన్యాసాలు వ్యూహాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాధారణ ఎయిర్‌బేస్‌లకు బదులుగా అవసరమైన సమయంలో రహదారులను ప్రత్యామ్నాయ ల్యాండింగ్ జోన్లుగా వినియోగించుకునే సామర్థ్యాన్ని ఈ తరహా శిక్షణలు పరీక్షిస్తాయి. యుద్ధ పరిస్థితుల్లో ప్రధాన రన్ వే లు అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ మౌలిక సదుపాయాలు కీలకంగా మారుతాయి. అందుకే సైన్యం చేపట్టే ఇలాంటి డ్రిల్స్ ను కేవలం శక్తి ప్రదర్శనగా చూడలేం. ఇవి సంక్షోభ సమయంలో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని మెరుగుపరిచే శిక్షణలో భాగం. సైనిక సంసిద్ధతలో భాగంగా ముందు జాగ్రత్త మేలు అన్నట్టుగా.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సిద్ధంగా ఉండేలా భారత బలగాలు తమ సామర్థ్యాలను నిరంతరం పరీక్షిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా హెలికాప్టర్లు హైవేపైకి దిగాయి.. తిరిగి గాల్లోకి ఎగిరాయి. చూడటానికి ఇది సాధారణ సైనిక విన్యాసంలా కనిపించినా.. దీని వెనుక ఉన్న వ్యూహం మాత్రం చాలా కీలకమైనది. జైసల్మేర్–బార్మేర్ ప్రాంతంలోని భారత్ మాల హైవేపై భారత సైన్యం అపాచీ, రుద్ర హెలికాప్టర్లతో ఈ డ్రిల్ నిర్వహించింది. అత్యవసర పరిస్థితుల్లో కార్యాచరణ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రక్రియగా చూడటం సముచితం. సరిహద్దు ప్రాంతాల్లో వేగంగా బలగాలను మోహరించడం, అవసరమైన చోట కార్యకలాపాలు కొనసాగించడం వంటి అంశాలపై ఈ తరహా శిక్షణలు దృష్టి పెడతాయి. దీంతో భారత సైనిక వ్యవస్థలో ప్రత్యామ్నాయ మౌలిక వసతుల వినియోగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టమవుతోంది.
భారత్ మాల హైవేపై అపాచీ, రుద్ర హెలికాప్టర్లు ల్యాండ్ కావడం, తిరిగి టేకాఫ్ కావడం ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హైవేపై హెలికాప్టర్ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా పైలట్లు, గ్రౌండ్ సిబ్బంది, ఇతర సహాయక బృందాల మధ్య సమన్వయాన్ని పరీక్షించవచ్చు. ప్రత్యామ్నాయ ల్యాండింగ్ ప్రాంతాలపై శిక్షణ ఉండటం సంక్షోభ సమయంలో విమాన కార్యకలాపాలను కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి సామర్థ్యం వేగవంతమైన ప్రతిస్పందనకు దోహదం చేస్తుంది. అపాచీ హెలికాప్టర్లో అధునాతన సెన్సర్లు, ఆయుధ వ్యవస్థలు ఉండటంతో ఇది అటాక్ మిషన్లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. రుద్ర భారతదేశంలో అభివృద్ధి చేసిన ఆయుధ సామర్థ్యం కలిగిన హెలికాప్టర్‌గా ఆర్మీ అవసరాలకు సేవలందిస్తోంది. వీటిని ఒకే డ్రిల్‌లో ఉపయోగించడం ద్వారా విభిన్న సామర్థ్యాల మధ్య సమన్వయాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో సైనిక మౌలిక వసతులను బహుళ ప్రయోజనాలకు వినియోగించుకునే దిశగా భారత్ ముందుకు సాగుతున్న విషయాన్ని ఈ విన్యాసాలు తెలియజేస్తున్నాయి. పాకిస్తాన్ చైనా, టర్కీ వంటి దేశాలతో రక్షణ సహకారాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో.. భారత సైన్యం తన సంసిద్ధతను నిరంతరం కొనసాగిస్తోంది. సరిహద్దుల్లో శత్రు కదలికలు ఎలా ఉన్నా.. భారత సైన్యం మాత్రం తన వ్యూహాలను ఎప్పటికప్పుడు పదును పెడుతోంది.