సర్‌క్రీక్‌ ఎందుకంత కీలకం?..ప్రతి కదలికను గమనిస్తున్న భారత్

Spread the love

జమ్మూ కశ్మీర్ తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య మరో కీలక వివాదాస్పద ప్రాంతం సర్‌క్రీక్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. గుజరాత్–సింధ్ సరిహద్దులో ఉన్న ఈ 96 కిలోమీటర్ల టైడల్ ఎస్ట్యురీ అరేబియా సముద్రంలో కలుస్తుంది.  బురద, ఉప్పునీరు, మడ ప్రాంతాలతో కనిపించే ఈ జోన్ వెనుక మాత్రం భారీ వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది.సర్‌క్రీక్‌పై సరిహద్దు ఎక్కడ ఉండాలన్న అంశంలో భారత్, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ రేఖ ఎక్కడ ముగుస్తుందన్నదే సముద్ర సరిహద్దు, ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌పై ప్రభావం చూపుతుంది.  అంటే చిన్నగా కనిపించే ఈ ప్రాంతం సముద్రంలో పెద్ద విస్తీర్ణంపై హక్కులకు సంబంధించిన అంశంగా మారుతుంది. ఇక్కడ సముద్ర వనరులు, మత్స్య సంపదతో పాటు భద్రతా ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి.ఈ ప్రాంతంలో ఏ చిన్న సైనిక కదలికైనా భారత్–పాక్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, నిఘా వ్యవస్థలను పెంచుతున్నట్లు పలు నివేదికలు వెలువడ్డాయి.  దీంతో భారత భద్రతా వ్యవస్థ కూడా పశ్చిమ తీరంపై నిఘాను మరింత పెంచుతోంది.ఇదే సమయంలో సర్‌క్రీక్ విషయంలో ఎలాంటి దుస్సాహసం జరిగినా కఠినంగా స్పందిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. సర్‌క్రీక్ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇది గుజరాత్‌లోని కచ్ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ నుంచి వేరు చేస్తూ అరేబియా సముద్రం వైపు సాగుతుంది.  ఇక్కడ నేల స్వభావం, ఆటుపోట్లు, మడ ప్రాంతాలు సాధారణ సైనిక కార్యకలాపాలకు సవాళ్లుగా ఉంటాయి. అందుకే ఈ ప్రాంతంలో పహారా నిర్వహించేందుకు ప్రత్యేకమైన సామర్థ్యాలు అవసరమవుతాయి. భారత్ ఇప్పటికే ఈ సున్నితమైన ప్రాంతంలో భద్రతా మౌలిక వసతులను బలోపేతం చేసే చర్యలు చేపడుతోంది. 2026 మేలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సర్‌క్రీక్, హరామి నాలా ప్రాంతంలో వాచ్‌టవర్లు, రహదారులు, వైద్య సదుపాయాలు, ఫెన్సింగ్ వంటి భద్రతా ఏర్పాట్లను ప్రస్తావించారు.  ఇదంతా సరిహద్దును కేవలం సైనిక బలంతోనే కాకుండా మౌలిక వసతులతోనూ పటిష్టం చేసే ప్రయత్నాన్ని సూచిస్తోంది.

మరోవైపు పాకిస్తాన్ కూడా సర్‌క్రీక్ పరిసరాల్లో తన ఉనికిని పెంచుతున్నట్లు భద్రతా నివేదికలు చెబుతున్నాయి. నిఘా వ్యవస్థలు, కోస్టల్ పట్రోలింగ్, హోవర్‌క్రాఫ్ట్ వంటి సామర్థ్యాలపై పాకిస్తాన్ దృష్టి పెట్టినట్లు సమాచారం ఉంది. భారత్ ఈ ప్రాంతంలో ముందస్తు భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇస్తోంది.అయితే సర్‌క్రీక్ వివాదానికి సైనిక పరిష్కారం మాత్రమే మార్గం కాదు.. సరిహద్దు చర్చలు, సముద్ర సరిహద్దు నిర్ధారణ కూడా కీలకమే. ఇదే కారణంగా సర్‌క్రీక్‌పై ప్రతి కదలికను భారత్ అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోంది.సర్‌క్రీక్ వివాదం కొత్తగా పుట్టిన సమస్య కాదు. 1947 తర్వాత గుజరాత్ భారత్‌లో ఉండగా.. సింధ్ పాకిస్తాన్‌లో భాగమైంది. అయితే సర్‌క్రీక్‌లో సరిహద్దు రేఖ ఏ విధంగా ఉండాలన్న అంశం మాత్రం పూర్తిగా పరిష్కారం కాలేదు. 1968లో రాణ్ ఆఫ్ కచ్ సరిహద్దు వివాదంలో ట్రిబ్యునల్ అవార్డు వచ్చినప్పటికీ.. సర్‌ క్రీక్‌కు సంబంధించిన సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇప్పటికే ఈ ప్రాంతంలో మత్స్యకారులు అనుకోకుండా మరో దేశపు జలాల్లోకి వెళ్లి అరెస్టయ్యే ఘటనలు కూడా సమస్యను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.  సముద్ర సరిహద్దు వివాదం సామాన్య మత్స్యకారుల జీవనంపై కూడా ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో భద్రతా కోణంలోనూ ఈ ప్రాంతం సున్నితమైనదిగా మారింది. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత సర్‌క్రీక్ సహా పశ్చిమ తీరంలో నిఘా వ్యవస్థలను భారత్ మరింత బలోపేతం చేసింది.  కాబట్టి సర్‌క్రీక్ కథలో చరిత్ర, సముద్ర హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు, జాతీయ భద్రత అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.ఇటీవలి కాలంలో సర్‌క్రీక్‌పై పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలు పెరుగుతున్నాయన్న నివేదికలు భారత భద్రతా వర్గాల్లో అప్రమత్తతను పెంచాయి.పాకిస్తాన్ ఈ ప్రాంతంలో కొత్త పోస్టులు, సైనిక మౌలిక వసతులు, కోస్టల్ నిఘా సామర్థ్యాలను పెంచినట్లు నివేదికలు తెలిపాయి. 2025లో పాకిస్తాన్ నేవీ చీఫ్ సర్‌క్రీక్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడం కూడా చర్చకు దారితీసింది. దీంతో భారత వైపు కూడా ఈ ప్రాంతంలో సముద్ర నిఘా, సరిహద్దు పహారా, మౌలిక వసతులపై దృష్టి పెరిగింది. 2025 అక్టోబర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సర్‌క్రీక్ విషయంలో పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే నిర్ణయాత్మకంగా స్పందిస్తామని స్పష్టం చేశారు.  ఆ వ్యాఖ్యలు సర్‌క్రీక్ ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. సర్‌క్రీక్ సరిహద్దు వివాదం పరిష్కారమైతే ఇరు దేశాల సముద్ర సరిహద్దుల నిర్ధారణకు కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం సరిహద్దు రేఖపై విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ వైపు సైనిక మౌలిక వసతుల విస్తరణపై భారత్ నిఘా పెంచింది.  భారత్ వైపు కూడా సర్‌క్రీక్, హరామి నాలా ప్రాంతాల్లో భద్రతా గ్రిడ్‌ను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి.  భారత్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తూనే.. సరిహద్దు భద్రత విషయంలో అప్రమత్తత కొనసాగిస్తోంది. అందుకే సర్‌క్రీక్‌లో ఇప్పుడు ప్రతి కదలికను నిశితంగా గమనించడం.. భవిష్యత్ భద్రతా సమీకరణాల్లో భారత్‌కు అత్యంత కీలకంగా మారుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *