సెక్రటేరియట్ ముట్టడిస్తాం..రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

Spread the love

కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ సెక్షన్ 22ఏ  తీసుకొచ్చింది? ఏళ్ల తరబడి కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని సామాన్యులు కొనుక్కున్న భూములను, రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టడం ఏంటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి బాధితు లకు న్యాయం చేసే బాధ్యత తమపై ఉందని  సెక్షన్ 22ఏ బాధితుల సమావేశంలో ఆయన  చెప్పారు. బాధితులకు న్యాయం చేయకుంటే తాము పోరాటానికి సిద్దమని వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సెక్షన్ 22ఏను తొలగింపజేస్తామని స్పష్టం చేశారు. సెక్షన్ 22ఏ జాబితాలోని భూములన్నీ తొలగించకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హరీష్ హెచ్చరించారు.  ఒక్క హైదరాబాద్‌   లోనే లక్షలాది ఆస్తులను ఈ జాబితాలో పెట్టారని, కాలనీలకు కాలనీలు ఈ 22ఏ జాబితాలోకి వెళ్లిపోయాయని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఏకంగా కోటి ఎకరాలను ఈ సెక్షన్ 22ఏ జాబితాలో చేర్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రాత్రికి రాత్రి భూములన్నీ నిషేధిత జాబితాలో పెడితే, రేపు ఆ పేదవాళ్లు తమ ఇళ్లలో ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలన్నా, ఆస్తులు అమ్ముకోవాలన్నా లేదా బ్యాంక్ లోన్ తెచ్చుకోవాలన్నా ఎలా కుదురుతుంది? ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది అని హరీశ్ రావు  ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

ఇదే సమయంలో గత కేసీఆర్  పాలనకు, ఇప్పటి రేవంత్ రెడ్డి  పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని హరీశ్ రావు  చాలా స్పష్టంగా వివరించారు. కేసీఆర్   పాలనలో ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగింది. కానీ, ఈ రేవంత్ సర్కార్ పాలనలో కేవలం భూములే కేంద్రంగా పరిపాలన సాగుతోంది అని ఆయన విమర్శించారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి, అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు, 24 గంటల ఉచిత కరెంటు అందించింది బీఆర్ఎస్  ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా, దేశానికే అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్ గారిది అని హరీశ్ రావు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి, కూల్చివేతలు , నిషేధాజ్ఞలతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్  గురించి హరీశ్ రావు   చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, యావత్ దేశం హైదరాబాద్ వైపు చూసేలా, ప్రపంచస్థాయి పెట్టుబడులు తెచ్చేలా కేసీఆర్ చేశారని ఆయన అన్నారు. కానీ, రేవంత్ రెడ్డి వచ్చాక కేవలం కొన్ని నెలల్లోనే ఆ అద్భుతమైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మంటగలిసిపోయింది అని మండిపడ్డారు. ఎప్పుడు హైడ్రా బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు 22ఏ నోటీసులు వస్తాయో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దీని దెబ్బకు రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. అమెరికాలో  ఉన్న  ఎన్నారైలు ఇక్కడ ఇళ్లు కొనాలంటేనే వణికిపోతున్నారన్నారు. పైసలుంటే అమెరికాలోనే పెట్టుబడులు పెట్టుకుంటున్నారు తప్ప, హైదరాబాద్ వైపు చూడటం మానేశారు అని హరీశ్ రావు కుండబద్దలు కొట్టారు. సామాన్యుల ఆస్తులను లాక్కునే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అని ప్రశ్నించిన హరీశ్ రావు . బేషరతుగా ఈ 22ఏ జాబితాలోని భూములన్నీ తొలిగించాలని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం మెడలు వంచైనా సరే బాధితులకు న్యాయం చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది అని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ సెక్షన్ 22ఏ ను తొలిగింపజేస్తామని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే.. లక్షలాది మంది బాధితులతో కలిసి ఏకంగా సెక్రటేరియట్  ను ముట్టడిస్తాం అని ఆయన దిమ్మతిరిగే హెచ్చరిక జారీ చేశారు. మొత్తం మీద చూసుకుంటే, తెలంగాణలో ఇప్పుడు కూల్చివేతలు, నిషేధిత జాబితాల చుట్టూనే రాజకీయం మొత్తం తిరుగుతోంది. ఏళ్లుగా ఉంటున్న ఇళ్లను కాపాడుకోవడం కోసం సామాన్యులు రోడ్ల మీదకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *