అమెరికాలో ‘స్టాచ్యూ ఆఫ్ యూనియన్’ వివాదం.. భగ్గుమన్న హిందూ అమెరికన్లు!

Spread the love

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఎన్నికల హీట్ ఊపందుకుంది. అమెరికా మధ్యంతర ఎన్నికల  వేళ రాజకీయ నాయకులు ప్రచారంలో వివిధ హామీలతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రం అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. అదే టెక్సాస్ రాష్ట్రంలో కొలువుదీరిన సాక్షాత్తూ 90 అడుగుల భారీ హనుమంతుడి విగ్రహం. అమెరికా గడ్డపై ఎంతో గర్వకారణంగా నిర్మించిన ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇప్పుడు కొంతమంది టార్గెట్ చేశారు. మేము గెలిచాక.. ఈ విగ్రహాన్ని కూల్చేస్తాం అంటూ ఒక కన్జర్వేటివ్ యూట్యూబర్ చేసిన సంచలన పోస్ట్ ఇప్పుడు అమెరికాలోని హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. 

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న  షుగర్ ల్యాండ్ ప్రాంతం భారతీయ అమెరికన్లకు, ముఖ్యంగా హిందువులకు ఒక ప్రధాన కేంద్రం. ఇక్కడే ఉన్న ప్రముఖ శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో 2024 ఆగస్టులో  భారీ హనుమాన్ విగ్రహాన్ని అత్యంత వైభవంగా ప్రతిష్ఠించారు. దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని నామకరణం చేశారు. ఏకంగా 90 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం.. అమెరికా దేశంలోనే అత్యంత ఎత్తైన మూడో విగ్రహంగా రికార్డు సృష్టించింది. ఒక భారతీయ దేవుడి విగ్రహం అమెరికాలో ఇంత భారీ స్థాయిలో నిర్మించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు గర్వకారణంగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ కోసం స్థానిక హిందూ సమాజం ఎంతో కష్టపడి, చట్టబద్ధమైన అనుమతులన్నీ తీసుకుని, సొంత నిధులతో దీన్ని నిర్మించుకున్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతున్నారు. అమెరికా లాంటి భిన్న సంస్కృతుల దేశంలో ఇదొక అద్భుతమైన కట్టడంగా నిలిచింది. అయితే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు రైట్-వింగ్ కన్జర్వేటివ్స్ అప్పటి నుంచీ తరచూ దీని ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏదో ఒక రూపంలో తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.  అదే ఇప్పుడు అమెరికా ఎన్నికల వేళ ఒక తీవ్రమైన బెదిరింపు స్థాయికి చేరుకుంది. తాజాగా జెస్సీ హూజెస్ అనే ఒక రైట్-వింగ్ కన్జర్వేటివ్ యూట్యూబర్ హనుమంతుడి విగ్రహ చిత్రాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేసి ఒక భయంకరమైన క్యాప్షన్ పెట్టాడు.  మేం గెలిచాక..దీన్ని కూల్చేస్తాం అని  రెచ్చగొట్టేలా మాట్లాడాడు. 

ఈ పోస్ట్ చూసిన వెంటనే అమెరికాలోని హిందూ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది కేవలం ఒక విగ్రహం మీద చేసిన కామెంట్ కాదని, అమెరికాలో శాంతియుతంగా జీవిస్తున్న మొత్తం హిందూయిజాన్ని బెదిరించడమేనంటూ అమెరికాలోని పలువురు హిందువులు, హిందూ సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఎవరైనా తమ నమ్మకాలను స్వేచ్ఛగా ఆచరించుకునే హక్కు ఆ దేశంలో ఉంది. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో, ట్యాక్స్ లు  కడుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న హిందువుల ఆరాధ్య దైవాన్ని కూల్చేస్తాం అని బహిరంగంగా పోస్టులు పెట్టడం ఏ రకమైన దేశభక్తి అని హిందూ అమెరికన్లు ఫైర్ అవుతున్నారు.  ఇది  కచ్చితంగా విద్వేషాన్ని రగిలించే చర్యలే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వివాదంలో బెదిరింపులపై కేవలం హిందువులు మాత్రమే కాకుండా, అమెరికాలోని లౌకికవాదుల  నుండి  కూడా హిందువులకు భారీగా  మద్దతు లభిస్తోంది. 

ఇతర మతాలకు చెందిన ఎంతో మంది అమెరికన్ పౌరులు ఈ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా అనేది వలసదారుల దేశమని, ఇక్కడ అన్ని సంస్కృతులను సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనేది విస్మరించకూడదని చెబుతున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ విగ్రహం అంశం ఇప్పుడు బాగా చర్చనీయాంశమవుతోంది. టెక్సాస్ రాష్ట్రాన్ని దశాబ్దాలుగా రిపబ్లికన్లు పాలిస్తున్నారు. అయితే ఈసారి అక్కడ డెమోక్రాట్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఇలాంటి కీలక సమయంలో, ఇండియన్-అమెరికన్ల ఓట్లు  రెండు పార్టీలకు ముఖ్యమే. టెక్సాస్ లో లక్షలాది మంది హిందూ ఓటర్లు ఉన్నారు. ఎవరైతే తమ మనోభావాలను గౌరవించి, తమ భద్రతకు భరోసా ఇస్తారో వారికే హిందూ అమెరికన్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. మొత్తానికి 90 అడుగుల హనుమంతుడి విగ్రహం ఇప్పుడు అమెరికా రాజకీయాలలో చర్చనీయంశంగా మారింది.  అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి యూట్యూబర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *