ఐదు రోజుల వర్క్ డేస్, ఇతర డిమాండ్లను సాధించుకోవడం కోసం ప్రభుత్వ రంగ బ్యాంకు యూనియన్లు మూడు రోజుల పాటు సమ్మెకు దిగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో అకౌంట్ హోల్డర్లకు బ్యాంకు సేవల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఆదివారం బ్యాంకులు పనిచేసేలా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ సమ్మె కాలంలో ఏటీఎం ఛార్జీల నుండి ఖాతాదారులకు ఎస్బీఐ మినహాయింపు ఇస్తోంది. ఏ బ్యాంకు ఏటీఎం నుండి ట్రాన్సాక్షన్స్ చేసినా ఛార్జీలు ఉండవని చెప్పడం ఖాతాదారులకు ఊరట కలిగించే అంశం. ఇక బ్యాంకు సేవల కోసం మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సప్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూచించింది. సమ్మె నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.
బ్యాంకుల బంద్ ల నేపథ్యంలో అకౌంట్ హోల్డర్లు ముందుగా మీ నగదు (Cash) అవసరాలను సరిగ్గా అంచనా వేసుకుని అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలి. రోజువారీ ఖర్చులు, వైద్య అత్యవసరాలు మరియు చిన్న వ్యాపార లావాదేవీల కోసం సరిపడేంత నగదును ముందే విత్‌డ్రా చేసి ఉంచుకోవడం శ్రేష్టం. బంద్ సమయంలో ఎటిఎంలలో (ATMs) కూడా నగదు త్వరగా అయిపోయే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు ఉండొచ్చు. కాబట్టి తగినంత నగదును చేతిలో ఉంచుకోవాలి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) మరియు డెబిట్/క్రెడిట్ కార్డ్‌ల వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోనే ఉంటాయి. ఇది కొంత ప్రయోజనకరం.
క్రెడిట్ కార్డ్ బిల్లులు, రుణాల ఈఎంఐలు (EMIs), ఇన్సూరెన్స్ ప్రీమియంలు మరియు చెక్కుల (Cheques) క్లియరెన్స్ వంటి కాలపరిమితి కలిగిన పేమెంట్స్ ను చూసుకోవాలి. బ్యాంక్ ప్రతినిధులమని లేదా కస్టమర్ కేర్ నుండి అని వచ్చే అనుమానాస్పద కాల్స్, SMSలు లేదా మెసేజ్‌ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఎటిఎం పిన్ (PIN), యూపీఐ పిన్, ఓటీపీ (OTP) లేదా పాస్వర్డ్ లను ఇతరులకు షేర్ చేసుకోకుండా అలెర్ట్ గా ఉండాలి. డిజిటల్ స్కామ్ కు గురయ్యే అవకాశం ఉంది. అలాగే నకిలీ హెల్ప్‌లైన్ నంబర్లను నమ్మి మోసపోవద్దు. బ్యాంకులు తమ అధికారిక వెబ్సైట్లు, SMS లేదా ఈ-మెయిల్ల ద్వారా పంపే నోటిఫికేషన్లను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.