పట్టుదలతో అనుకున్న దానిని సాధిస్తే ఆ కిక్కే వేరు. అందులో ఎన్ని అపజయాలు ఎదురయ్యాయో ఆ తరువాత వచ్చే ఆ విజయం అంత భారీస్థాయిలో మజా ఉంటుంది. ఒక ఉపాధ్యాయ ఉద్యోగం కోసం 27 శ్రమించి దానిని పొంది తన పట్టుదలను చాటుకున్నారు ఉత్తరప్రదేశ్ లోని భాగపత్ కు చెందిన విజయ్ కుమార్ శర్మ. 59 ఏళ్ల వయసులో ఆయన తాను కోరుకున్న ఉద్యోగం సాధించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన ఎట్టకేలకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. సాధారణంగా ఈ వయసులో ఉద్యోగ విరమణ గురించి ఆలోచిస్తారు. కానీ ఆయన మాత్రం సరిగ్గా ఇదే వయసులో తన తొలి ప్రభుత్వ కొలువును అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన విజయం వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు ఉన్నాయి.ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లా బరౌట్ పట్టణంలోని బడావద్ గ్రామానికి చెందిన ఆయన గత రెండు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ పాఠశాలల్లోనూ, కోచింగ్ కేంద్రాలలోనూ బోధన చేస్తూ తన కలను మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టలేదు. బరౌట్లోని ప్రఖ్యాత దూన్ పబ్లిక్ పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూనే ఈ లక్ష్యం కోసం కష్టపడ్డారు. పగటిపూట పాఠాలు చెబుతూనే, రాత్రివేళల్లో పోటీ పరీక్షల కోసం తీవ్రంగా శ్రమించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నోసార్లు వైఫల్యాలు ఎదురైనా ఆయన వెనుకంజ వేయలేదు. ఈ సుదీర్ఘ పోరాటంలో అనేకసార్లు రాత పరీక్షల్లో విజయం సాధించినా ఇంటర్వ్యూల దశలో విఫలమయ్యారు. రాత పరీక్షల్లో ప్రతిభ చూపినప్పటికీ, మౌఖిక పరీక్షల సమయంలో పడిన ఇబ్బందుల వల్ల ఆయనకు ఉద్యోగం లభించలేదు. ఈ పరిణామాలు బాధించినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు మరియు ఉపాధ్యాయ నియామక ప్రక్రియను మరింత సులభం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు వీరికి కలిసివచ్చాయి. తాజాగా జరిగిన నియామక ప్రక్రియలో ఉపాధ్యాయ నియామకంలో ఇంటర్వ్యూల విధానాన్ని ప్రభుత్వం తొలగించడంతో ఆయన తన కలను నిజం చేసుకున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 22వ తేదీన లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలు కావడంతో, ఆయనకు ఇంకా సేవాకాలం మిగిలి ఉంది. ఈ తక్కువ కాలమైనా ప్రభుత్వ ఉద్యోగిగా సేవ చేయాలనే ఆయన కల నెరవేరింది. నిరంతరం శ్రమిస్తే ఏ వయసులోనైనా విజయం సాధించవచ్చని ఆయన నిరూపించారు.