మళ్లీ కెమెరా ముందుకు పవర్ స్టార్

గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీ బిజీగా గడిపిన పవన్ మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. ఈ నెల 23 నుంచి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ రీ స్టార్ట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నిక్ పోవెల్ తెరకెక్కించనున్నారు.

గత నాలుగేళ్లుగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతోంది.ఈ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించగా.. పలు కారణాల చేత ఈ ప్రాజెక్టు నుంచి ఆయన బయటకు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఈ మూవీ మరొకరి చేతిలోకి వెళ్లడం, పవన్ రాజకీయాల్లో బిజీ కావడం వంటి చాలా కారణాల చేత మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో వీలైనంత త్వరగా ఈ మూవీని కంప్లిట్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నారట. అందుకే రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి పెండింగ్ లో ఉన్న మూవీస్ ను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. హరి హర వీరమల్లుతో పాటు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్.. వంటి సినిమాలు కూడా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీస్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి మళ్లీ పాలిటిక్స్ లో బిజీ కానున్నారు పవన్.

ఇకపోతే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిచి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన పవన్ భారీ మెజారిటీతో విజయం సాధించిగా.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం, పంచాయతీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి చాలా రోజుల తరువాత పవన్ సెట్స్ లో అడుగు పెడుతుండడంతో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన పవన్.. రాబోయే మూవీస్ తో ఎలాంటి రికార్డుల మోత మోగిస్తారో చూడాలి.