ఎత్తైన భవనం, అందమైన కళారూపాలతో ఆహ్వానించే అతిపెద్ద సింహద్వారం, మయ సభను తలపించేలా ప్రధాన హాలు, పద్మ వ్యూహాన్ని తలదన్నేలా నిర్మాణం… ఒక్కసారి ఆ ఇంటిలోకి వెళితే రాజుల కాలం నాటి కోటల్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. చూడటానికి సినిమా చెట్లలా కనిపిస్తున్న ఈ భవనాలకి 100 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇదంతా ఎక్కడని అనుకుంటున్నారా పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంటలో ఉన్న గంధర్వమహల్ లోనే.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఉన్న గంధర్వ మహల్ కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ ఉన్న గంధర్వ మహల్ ను చూస్తే ఏదో రాజు నిర్మించి ఉంటాడని అనుకుంటారు. కానీ ఆచంట నియోజకవర్గంలోని ఆచంట గ్రామానికి చెందిన ఒక జమీందార్ ఎంతో ఇష్టపడి కట్టించుకున్న కట్టడం ఇది. ఆచంట గ్రామానికి చెందిన గొడవర్తి నాగేశ్వరరావు 1920 ఈ గంధర్వ మహల్ ను నిర్మించారు. అప్పట్లో సరైన సదుపాయాలు లేనందువల్ల ఈ భవన నిర్మాణానికి ఐదేళ్లు సమయం పట్టింది.
గోదావరి జిల్లాలోని అద్భుత కట్టడాల్లో ఒకటిగా ఈ గంధర్వ మహల్ నిలిచింది.ఈ భవనాన్ని నిర్మించేందుకు విదేశాల నుంచి మెటీరియల్ తీసుకొచ్చారు. బెల్జియం నుంచి కలప, లండన్ నుంచి ఇనుప స్తంభాలను ఓడల ద్వారా చెన్నైకి తీసుకువచ్చి అక్కడ నుంచి ఆచంట గ్రామానికి తరలించారు. భవనం నిర్మించే టప్పుడు సిమెంట్ లేకపోవడం వల్ల కోడిగుడ్లు జనపనారతో నిర్మించారు. అందుకనేమో భవనం కట్టి దశాబ్దం అవుతున్నా ఎక్కడా చెక్కుచెదరలేదు. గంధర్వ మహల్ నిర్మాణం పూర్తయ్యేటప్పటికీ విద్యుత్ సదుపాయం లేనందువల్ల వేరే దేశాల నుంచి జనరేటర్లు తెప్పించి విద్యుత్ కాంతులతో మెరిసేలా చేశారు.
1916 వ సంవత్సరంలో రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన జమిందారు.. అక్కడ ఉన్న కట్టడాలను చూసి తాను కూడా ఇలాంటి ఒక కోటను నిర్మించుకోవాలని అనుకొన్నాడు. 1918లో గంధర్వ మహల్ పనులు మొదలుపెట్టి 1924 నాటికి పూర్తి చేశారు. అప్పట్లో ఈ గంధర్వ మహల్ నిర్మాణానికి 10 లక్షలు ఖర్చయిందంట. 2000 గజాల్లో ఉన్న ఈ గంధర్వ మహల్ లో రెండు అంతస్తులు, పెద్ద పెద్ద విశాలమైన హాళ్లు రెండు, దానితోపాటు 36 పడక గదులు ఉన్నాయి. అలాగే ఈ మహల్లో లండన్ నుంచి తెచ్చిన పియానో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1820లో లండన్లో నిర్వహించిన పోటీల్లో ఈ పియానో అవార్డును దక్కించుకుంది. ఇప్పటికీ ఈ పియానో సుస్వరాలను పలుకుతుంది.
ఇంకా ఈ మాల్ లో పూర్వకాలం నాటి వస్తువులు కనువిందు చేస్తుంటాయి. ప్రతి హాలులో కూడా గోడలకు ఇరువైపులా పెద్ద పెద్ద అద్దాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. ప్రత్యేకంగా బెల్జియం నుంచి తెప్పించిన అద్దం ఎదురుగా నిలబడితే ఏడు ప్రతిబింబాలు కనిపిస్తాయంట. ఆచంట నియోజకవర్గం లోని ఆచంట గ్రామానికి ప్రముఖులు ఎవరు వచ్చినా ఈ గంధర్వ మహల్ ను చూడకుండా వెళ్లరు. శివరాత్రి వచ్చిందంటే గుడికి వచ్చిన భక్తులు అటుగా వెళుతూ గంధర్వ మహల్ ఎదుట నిలబడి సెల్ఫీ దిగుతూ ఉంటారు. ఈ గంధర్వ మహల్ ను పెద్దపెద్ద నిర్మాతలు సైతం షూటింగులకి అడిగినప్పటికీ, పర్యాటక కేంద్రంగా మార్చటానికి అడిగినా.. గొడవర్తి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం ఈ గంధర్వ మహల్ లో గొడవర్తి నాగేశ్వరరావు మనవళ్లు ఉంటున్నారు. ఈ గంధర్వ మహల్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గొడవర్తి కుటుంబ సభ్యులు భవనానికి కనువిందు చేసేటట్టు రంగులు వేయించారు.