శాస్త్రాల ప్రకారం దీపావళి పండుగను కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే ఈసారి అమావాస్య తిథి అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీన రెండు రోజుల పాటు వచ్చింది. దీంతో అందరిలోనూ గందరగోళం నెలకొంది. అయితే వేద క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:12 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు సాయంత్రం 5:14 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. కానీ దృక్ గణితం ప్రకారం దీపావళి రోజున అమావాస్య తిథి ప్రదోష కాల సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి ఈసారి నవంబర్ 1వ తేదీన అమావాస్య తిథి, ప్రదోష కాలం, నిశిత ముహుర్తాలలో జరుపుకోవడం శుభప్రదమని కోనసీమ పండితులు, ప్రముఖ పంచాంగ కర్త ఉపద్రష్ట నాగాదిత్య చెబుతున్నారు..