మెగా9 న్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ లో ఈమధ్య కాలంలో దొంగతనాల కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ విచిత్రంగా ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న నేతల ఇళ్లను కూడా దొంగలు టార్గెట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో మంత్రి ఇంట్లో ఇప్పుడు దొంగలు పడినట్లు వార్తలు వస్తున్నాయి.
వివరాలకు వెళ్తే హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నివాసంలో సెల్ ఫొన్ చోరీకి గురైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గత నెల 31వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి ఇంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఏ సతీష్ కుమార్ లక్ష్మీ పూజ నిర్వహించారు. పూజ అనంతరం రాత్రి 9:30 గంటలకు ఆయన సెల్ ఫోన్ కోసం చూడగా కనిపించలేదు. అన్ని ప్రాంతాలు వెతికిన ఉపయోగం లేకుండాపోయింది.
దీంతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పిఏ సతీష్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. మంత్రి ఇంట్లో పూజలకు ఎంతోమంది అతిధులు వచ్చారని, ఎలా చోరీకి గురైందో తెలియదని పోలీసులకు ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పూజలో నిమగ్నమై ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు సెల్ ఫోన్ చోరీ చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. దీపావళి తర్వాత వారం రోజులుగా తాను విధులు నిర్వహణలో బిజీగా ఉన్నానని, దీంతో శనివారం ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బంజారా హిల్స్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రజలను పాలించే ప్రజాప్రతిథుల ఇంట్లోనే భద్రత లేకుంటే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ నేటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.