అల్లరి నరేష్ మళ్లీ మేజిక్ చేస్తాడా?

Spread the love

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ సినిమాలకు అల్లరి నరేష్ పేరు బ్రాండ్‌లా ఉండేది. ఆయన సినిమా విడుదల అవుతుందంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతామని థియేటర్లకు వెళ్లేవారు. వరుస విజయాలతో కామెడీ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరేష్, తర్వాత కాలంలో తన ఇమేజ్‌ను మార్చుకోవాలని భావించి విభిన్నమైన కథలను ఎంచుకున్నారు. అయితే ఆ ప్రయోగాల్లో చాలా వరకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ ఇప్పటికే టీజర్‌తో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల్లరి నరేష్ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను కూడా ఆయన తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. కానీ కాలం మారడంతో ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. దీంతో ఒకే తరహా కామెడీ సినిమాలు చేయడం కంటే కొత్త కథలతో ముందుకు రావాలని ఆయన నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో సీరియస్ పాత్రలు కూడా చేశారు. ఆ మధ్య కాలంలో ‘బచ్చల మల్లి’, ‘12ఏ రైల్వే కాలనీ’ లో నటించారు. సామాజిక సందేశంతో వచ్చిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, యాక్షన్, రివెంజ్ నేపథ్యంలో రూపొందిన ‘ఉగ్రం’ ఇలా డిఫెరెంట్ పాత్రల్లో కనిపించారు. కొన్ని సినిమాలు ఆశించిన విజయాలు అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ కామెడీ వైపు అడుగులు వేయడం అభిమానుల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది. తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో వినోదానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.సినిమా కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. వినోదభరిత సంఘటనలు కథకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రీషా, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం కామెడీ సినిమాలకు కూడా ప్రేక్షకుల అంచనాలు చాలా పెరిగాయి. అందుకే ‘రంభ ఊర్వశి మేనక’ విజయం కథ, కామెడీ, నటీనటుల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అల్లరి నరేష్ పాత కామెడీ మ్యాజిక్‌ను మళ్లీ చూపించగలిగితే ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.ఈ చిత్రం అల్లరి నరేష్ కెరీర్‌లో 65వ సినిమాగా రూపొందుతోంది. చాలా కాలంగా ఒక పెద్ద కమర్షియల్ విజయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఈ సినిమా కీలకంగా మారింది. మొత్తానికి, మరోసారి తనకు పేరు వచ్చిన జానర్ లో కనిపించనుండడంతో కామెడీని ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *