తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన సందీప్, ఆ తర్వాత బాలీవుడ్లో ‘యానిమల్’ తో మరోసారి దేశవ్యాప్తంగా తన సత్తా చాటారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడమే కాకుండా, దర్శకుడిగా ఆయనకు ప్రత్యేకమైన కల్ట్ ఫ్యాన్ బేస్‌ను కూడా తీసుకొచ్చాయి. తాజాగా ఆయన అర్జున్ రెడ్డి సినిమా విడుదలై 9 ఏళ్లు. ఇక సందీప్ రెడ్డి వంగా సినిమాల గురించి ఎంత చర్చ జరుగుతుందో, ఆయన మాట్లాడే ప్రతి మాట గురించి కూడా అంతే చర్చ జరుగుతుంది. తన అభిప్రాయాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే ఆయన తీరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. అందుకే ఆయన పాల్గొనే ప్రతి కార్యక్రమంలో మీడియా ప్రత్యేక ఆసక్తి చూపుతుంది. తాజాగా సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా రూపొందిన ‘రోమాంచకం’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ప్రభాస్ కెరీర్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా సినిమాల గురించి ప్రేక్షకుల్లో ఇప్పటికే ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఏర్పడింది. ఆయన తెరకెక్కించే చిత్రాల్లో హింస, బలమైన భావోద్వేగాలు, తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాదాపు ప్రతి సినిమాకు ‘A’ (Adults Only) సర్టిఫికెట్ వస్తుందనే భావన ప్రేక్షకుల్లో ఉంది. ఈ విషయాన్ని మీడియా కూడా ప్రస్తావించగా, సందీప్ తనదైన శైలిలో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తాను నిర్మాతగా వ్యవహరించిన ‘రోమాంచకం’ సినిమాకు తొలిసారి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సినిమా మొత్తం కుటుంబం కలిసి చూసేలా రూపొందించామని చెప్పారు. ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా ఇదేనని వివరించారు.
ఈ సందర్భంగా విలేకరులు ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా గురించి ప్రశ్నించారు. ముఖ్యంగా ఆ సినిమాకు కూడా ‘ఏ’ సర్టిఫికెట్ వస్తుందా అని అడగగా, సందీప్ నవ్వుతూ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.”నేను ఎంత క్లీన్‌గా సినిమా తీయాలని ప్రయత్నించినా… సెన్సార్ వాళ్లు నాకు ‘ఏ’ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తారు. ‘స్పిరిట్’కు కూడా కచ్చితంగా అదే వస్తుందేమో” అంటూ సరదాగా స్పందించారు. ఆయన చెప్పిన ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారిని నవ్వించడమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా వేగంగా వైరల్ అయ్యాయి. సందీప్ చెప్పిన ఈ మాటలను అభిమానులు కూడా సరదాగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా గురించి ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తోంది. ప్రభాస్ తొలిసారి పూర్తి స్థాయి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రను సందీప్ రెడ్డి వంగా ఎలా డిజైన్ చేస్తారన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండను, ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్‌ను పూర్తిగా కొత్త కోణంలో చూపించిన సందీప్, ఇప్పుడు ప్రభాస్‌ను కూడా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.