లక్షలాది మంది టెకీల డ్రీమ్ డెస్టినేషన్ అమెరికా. తమ డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు అమెరికా వెళ్లాలని అక్కడ మంచి కొలువు సంపాదించుకుని స్థిరపడాలని ప్రయత్నిస్తుంటారు. తాజాగా అమెరికా నూతన హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా 1,03,265 డాలర్లు.. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 90 లక్షల రూపాయల భారీ అదనపు రుసుము విధించాలని ప్రతిపాదించింది. దీంతో చాలా మంది ఆశావహులకు ఇది మింగుడుపడని విషయమే. అయితే వివరాల్లోకి వెళ్లి చూస్తే అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ సంచలన ప్రతిపాదనను అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 24న వెలువడిన ఈ నిబంధనల ప్రకారం..ఈ 90 లక్షల ఫీజు అనేది ఇప్పటికే ఉన్న వీసా ఫీజులకు అదనం మాత్రమే. అయితే ఇక్కడ ఉద్యోగులు కాస్త ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ 90 లక్షల రూపాయల ఫీజును వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగి కట్టాల్సిన అవసరం లేదు. ఆ విదేశీ నిపుణుడిని ఏ అమెరికన్ కంపెనీ అయితే ఉద్యోగంలోకి తీసుకుంటుందో, స్పాన్సర్ చేసే ఆ కంపెనీయే ఈ మొత్తాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది కాబట్టి, తుది నిబంధనగా అమల్లోకి వచ్చే వరకు ఈ రుసుము ఎవరూ చెల్లించాల్సిన అవసరం లేదనేది గమనించాలి. మరి ఈ భారీ ఫీజు అందరికీ వర్తిస్తుందా అంటే.. లేదు. ఈ కొత్త రుసుము కేవలం వార్షిక పరిమితికి లోబడి ఉండే H-1B పిటిషన్లకు మాత్రమే వర్తించనుంది. అమెరికా ప్రతి ఏడాది రెండు కేటగిరీల్లో H-1B వీసాలను జారీ చేస్తుంది. మొదటిది సాధారణ కేటగిరీలో ఇచ్చే 65,000 వీసాలు, రెండవది అమెరికా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ లేదా అంతకంటే ఉన్నత డిగ్రీ పొందిన వారికి ఇచ్చే మరో 20,000 వీసాలు. ఈ రెండు కేటగిరీల కింద కొత్తగా దరఖాస్తు చేసుకునే పిటిషన్లపై ఈ ప్రతిపాదిత రుసుము కచ్చితంగా వర్తిస్తుంది. అయితే కొన్నింటికి దీని నుంచి పూర్తి మినహాయింపు లభించింది. క్యాప్ కు లోబడి లేని H-1B దరఖాస్తులకు ఈ అదనపు రుసుము వర్తించదు. అంటే.. కొన్ని ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, లాభాపేక్షలేని పరిశోధనా సంస్థలకు సంబంధించిన దరఖాస్తులు ఈ ప్రతిపాదన పరిధిలోకి రావు. ఇది వారికి దక్కిన అతిపెద్ద ఊరట. ఈ లక్ష డాలర్ల అదనపు రుసుము ద్వారా ప్రతి ఏడాది ప్రభుత్వ ఖజానాకు సుమారు 8.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని DHS అంచనా వేసింది. అమెరికాలో పెరుగుతున్న ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల పరిశీలన, కఠినమైన భద్రతా తనిఖీలు, వీసా మోసాల నిరోధం, ఇమ్మిగ్రేషన్ కోర్టుల నిర్వహణ, కాన్సులర్ సేవలు, కార్మిక ప్రమాణాల అమలు వంటి ప్రభుత్వ కార్యకలాపాల ఖర్చులను భరించేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు వారు అధికారికంగా తెలిపారు. అమెరికా పౌరుల పన్నుల డబ్బుతో కాకుండా, విదేశీయులను తీసుకునే కార్పొరేట్ కంపెనీల దగ్గర నుంచే ఈ సిస్టమ్ నిర్వహణ ఖర్చులను రాబట్టాలన్నది ట్రంప్ సర్కార్ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ చట్టం గనక అమలైతే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రభావితమయ్యేది మన భారతీయులే. ఎందుకంటే, అమెరికాలోని టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన తదితర రంగాల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులు అత్యధికంగా ఈ వీసాపైనే ఆధారపడుతున్నారు. H-1B కార్యక్రమాన్ని అత్యధికంగా ఉపయోగించుకునే దేశాల్లో భారత్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. ఈ కొత్త రుసుము అమల్లోకి వస్తే, విదేశీ నిపుణులను నియమించుకోవడం అమెరికన్ కంపెనీలకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ఒక ఉద్యోగికి లక్ష డాలర్ల జీతం ఇవ్వడానికంటే ముందే, ఫీజు రూపంలో మరో 90 లక్షల రూపాయలు కట్టాల్సి రావడం వల్ల.. ఏ కంపెనీ కూడా ఎంట్రీ లెవల్ జాబ్స్ లేదా ఫ్రెషర్స్ కోసం దరఖాస్తు చేయడానికి సాహసించదు. వ్యాపార సంస్థలు ఇతర దేశాలకు తమ ప్రాజెక్టులను మార్చడం లేదా స్థానిక అమెరికన్లనే నియమించుకోవడానికి మొగ్గుచూపే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది సులభంగా చట్టంగా మారే పరిస్థితి లేదు. ఈ ప్రతిపాదన ఇప్పటికే న్యాయపరమైన సవాళ్లకు దారితీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా లక్ష డాలర్లు H-1B రుసుమును విధించే ప్రయత్నం జరిగినప్పుడు కోర్టుల్లో వివాదం నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి, వ్యాపార సంస్థల నుంచి 30 రోజుల పాటు అభిప్రాయాలను DHS స్వీకరించనుంది. అనంతరం వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారు.