ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ను భారత్ తన స్వంత అభీష్టానుసారం, స్వంత నిబంధనల ప్రకారమే ఆపినట్లు రాజ్ నాథ్ స్పష్టం చేశారు. . ఒకవేళ అవసరమైతే, సుదీర్ఘ పోరాటానికైనా మేము పూర్తి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. మా ‘సర్జ్ కెపాసిటీ’ (అంటే ఆకస్మిక అవసర సమయాల్లో సామర్థ్యాన్ని విస్తరించుకునే శక్తి) అప్పుడు ఉండటమే కాకుండా, ఇప్పుడు కూడా ఉంది. పైగా అది మునుపటి కంటే మెరుగైన స్థితిలో ఉందని పేర్కొన్నారు. సామర్థ్యం లేక కాదని అది ఒక వ్యూహాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రాజ్ నాథ్ ఈ ప్రకటనతో భారత్ వ్యతిరేక శక్తులకు గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది. ఉగ్రవాదంపై కూడా మండిపడ్డారు. ఉగ్రవాదం అనేది ఒక వికృత మానసిక స్థితి. ఇది యావత్ మానవాళికే ఒక మచ్చ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగే పోరాటం కేవలం భద్రతకు మాత్రమే సంబంధించినది కాదు, ఇది మానవత్వపు ప్రాథమిక విలువలను రక్షించుకోవడానికి జరిగే యుద్ధం. ఈరోజు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ‘IT’ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కి పేరుగాంచితే, పాకిస్థాన్ మరో ‘IT’ (ఇంటర్నేషనల్ టెర్రరిజం – అంతర్జాతీయ ఉగ్రవాదం) కు కేంద్రంగా పరిగణించబడుతోందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో, మారుతున్న ఈ ప్రపంచ క్రమంలో భారత్ మరింత అప్రమత్తతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాద కార్యకలాపాలను సహించేది లేదన్నదే మా ప్రభుత్వ విధానం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము సర్జికల్ స్ట్రైక్స్ మరియు ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించాము, అలాగే పహల్గామ్ ఘటన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టాము. ఉగ్రవాదంపై మాకున్న స్పష్టమైన వైఖరికి ఇవే నిదర్శనాలని రాజ్ నాథ్ పేర్కొన్నారు.