మువ్వెన్నెల జాతీయ జెండా 140 కోట్ల మంది భారతీయుల గుర్తింపు. కులం, మతం, ప్రాంతం మర్చిపోయి.. ఒకే ఒక జెండా కింద ఒక్కటవుతారు. అదే మన తిరంగా! కానీ, ప్రపంచ పటంలో మన దేశానికి ఒక ఐడెంటిటీ ఇచ్చిన ఆ జెండా ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఎవరు రూపొందించారు. ఈ ప్రశ్న అడిగితే.. మన తెలుగు వాళ్ల కాలర్ ఆటోమేటిక్‌గా పైకి లేస్తుంది. అవును.. ఆ జాతీయ పతాకం ఒక అచ్చమైన తెలుగు వాడే.. పింగళి వెంకయ్య . దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన నిస్వార్థ దేశభక్తుడు. కానీ, ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ దేశానికి ఒక గుర్తింపు ఇచ్చిన ఆ మహనీయుడిని, దేశం చివరి రోజుల్లో మర్చిపోయింది. ఒక పూరి గుడిసెలో, పూట గడవని దారిద్య్రంలో ఆయన కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, భట్లపెనుమర్రు అనే ఒక చిన్న గ్రామంలో 1876 ఆగస్టు 2న జన్మించారు ప్రాథమిక విద్య మచిలీపట్నంలో పూర్తి చేసిన ఆయన.. కేవలం 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ సైన్యంలో చేరారు. ఆ ఉద్యోగమే ఆయన జీవితాన్ని మార్చేసింది. బ్రిటిష్ సైనికుడిగా దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఒక సంఘటన వెంకయ్య గారి గుండెల్లో అగ్నిపర్వతం రాజేసింది. ప్రతిరోజూ ఉదయం బ్రిటిష్ సైనికులు వారి జాతీయ జెండా అయిన యూనియన్ జాక్ కు సెల్యూట్ చేసేవారు. భారతీయులైన వెంకయ్య కూడా ఆ పరాయి జెండాకు సెల్యూట్ చేయాల్సి వచ్చేది. నా దేశం కాని దేశపు జెండాకు నేను ఎందుకు సెల్యూట్ చేయాలి? వందల ఏళ్ల చరిత్ర ఉన్న నా భారతదేశానికి అంటూ ఒక జెండా లేదా? అన్న ప్రశ్న ఆయనలో మొదలైంది. సరిగ్గా అదే సమయంలో దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం.. భారత జాతీయ జెండా ఆవిర్భావానికి తొలి అడుగుగా మారింది.
జాతీయ జెండా అంటే ఒక దేశపు సంస్కృతికి, పోరాటానికి అది సింబల్. దాని కోసం పింగళి వెంకయ్య చేసిన రీసెర్చ్ తెలిస్తే.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఆయన అనుకున్నదే తడవుగా.. ప్రపంచంలోని 30 కి పైగా దేశాల జాతీయ జెండాలను ఐదేళ్ల పాటు డీప్‌గా స్టడీ చేశారు. ఏ దేశపు జెండా వెనుక ఎలాంటి చరిత్ర ఉందో అనలైజ్ చేస్తూ.. 1916లో ఎ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఆ తర్వాత.. 1921లో విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలకు మహాత్మా గాంధీ వచ్చారు. అక్కడే గాంధీజీ చేతుల్లో ఒక జెండా నమూనాను పెట్టారు వెంకయ్య. మొదట అందులో హిందువులు, ముస్లింలకు ప్రతీకగా ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉన్నాయి. అయితే దేశంలో ఉన్న ఇతర మతాలు , శాంతికి ప్రతీకగా తెలుపు రంగును, స్వదేశీ వస్త్రాలకు గుర్తుగా రాట్నంను చేర్చాలని గాంధీజీ సూచించారు. అలా తయారైన జెండా.. 1947లో స్వాతంత్ర్యం వచ్చే సమయానికి రాజ్యాంగ సభలో స్వల్ప మార్పులు చేసుకుని ..ఎరుపు స్థానంలో కాషాయం, రాట్నం స్థానంలో అశోక చక్రం నేటి మన త్రివర్ణ పతాకంగా అధికారికంగా ఆమోదం పొందింది.
భారత జాతీయ పతాకం ఒకేరోజులో రూపుదిద్దుకోలేదు. అది స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు ఎన్నో మార్పులు చవిచూసింది. 1906లో బెంగాల్లో స్వదేశీ ఉద్యమం సందర్భంగా కలకత్తాలో తొలిసారిగా ఒక జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల ఐక్య పోరాటానికి ప్రతీకగా నిలిచింది. 1907లో విప్లవకారిణి మేడమ్ భికాజీ కామా పారిస్‌లో భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించి, భారత స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. 1917లో అన్నీ బీసెంట్, బాల గంగాధర్ తిలక్ నాయకత్వంలోని హోమ్ రూల్ ఉద్యమ సమయంలో మరో కొత్త పతాకాన్ని ఉపయోగించారు. అది స్వపరిపాలన కోసం సాగిన ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది. 1921లో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకం భారత జాతీయ పతాకానికి పునాది వేసింది. అందులోని రంగులు భారత సమాజంలోని వైవిధ్యాన్ని, మధ్యలోని చరఖా దేశ ఆర్థిక స్వావలంబనను సూచించేది. 1931 లో త్రివర్ణ పతాకంలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను అధికారికంగా ఖరారు చేశారు. తరువాత చరఖా స్థానంలో అశోక చక్రాన్ని చేర్చడం ద్వారా నేటి భారత జాతీయ పతాకం రూపుదిద్దుకుంది.
ఒక జెండాను డిజైన్ చేసి చరిత్ర సృష్టించిన వెంకయ్య ని..మనం కేవలం జెండా రూపకర్తగానే చూస్తాం. కానీ ఆయనలో ఉన్న ప్రతిభ సాధారణమైంది కాదు. ఆయన ఒక సైంటిస్ట్, ఒక జియాలజిస్ట్, ఒక రైటర్, బహుభాషా కోవిదుడు. అసలు పింగళి వెంకయ్య గారికున్న ఆ బిరుదులు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. పింగళి వెంకయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అనడానికి ఆయనకున్న బిరుదులే నిదర్శనం. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన రీసెర్చ్ మామూలుది కాదు. కంబోడియా పత్తి రకంపై ఆయన చేసిన అద్భుతమైన పరిశోధనలకు గాను ఆయన్ని జనం పత్తి వెంకయ్య అని ముద్దుగా పిలుచుకునేవారు. అలాగే భూగర్భ శాస్త్రం లో, ముఖ్యంగా వజ్రాల గనుల తవ్వకాలపై ఆయనకు ఉన్న అపార జ్ఞానాన్ని చూసి బ్రిటిష్ వాళ్లు సైతం ఆశ్చర్యపోయేవారు. అందుకే ఆయనకు డైమండ్ వెంకయ్య అనే పేరు కూడా వచ్చింది. ఇక భాషల విషయానికొస్తే.. ఉర్దూ, సంస్కృతంతో పాటు జపనీస్ భాషను అనర్గళంగా మాట్లాడేవారు. ఆయన జపనీస్ స్పీచ్ విని.. అందరూ ఆయన్ని జపనీస్ వెంకయ్య అని పిలవడం మొదలుపెట్టారు. ఒకే మనిషిలో ఇన్ని టాలెంట్స్ ఉండటం బహుశా చరిత్రలో చాలా అరుదు. అయితే ఇంతటి మేధావి, ఈ దేశానికి జాతీయ జెండా ఇచ్చిన ఒక గొప్ప త్యాగధనుడి చివరి రోజులు వింటే కన్నీళ్లు ఆగవు. స్వతంత్ర భారతవని ఆకాశంలో జెండా ఎగురుతుంటే.. ఆ జెండాను కనిపెట్టిన చేతులు మాత్రం తినడానికి తిండి లేక అల్లాడిపోయాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఢిల్లీ పీఠం మీద కూర్చున్న నాయకులంతా త్రివర్ణ పతాక నీడలో అధికారం అనుభవిస్తున్నారు. కానీ ఆ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మాత్రం విజయవాడలోని ఒక చిన్న పూరి గుడిసెలో, తీవ్ర దారిద్ర్యంలో బతికారు. ప్రభుత్వం నుంచి ఆయనకు దక్కాల్సిన కనీస గుర్తింపు, ఆర్థిక సాయం అందలేదు. దేశం కోసం బతికిన ఆ మహనీయుడు.. చివరికి 1963 జూలై 4న ఎవరికీ తెలియకుండానే కన్నుమూశారు. దశాబ్దాల తర్వాత గానీ ప్రభుత్వాలకు ఆయన గొప్పదనం గుర్తుకు రాలేదు. 2009లో ఆయన జ్ఞాపకార్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఇటీవలే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ఆయనను జాతి స్మరించుకుంది. అయితే తాజాగా జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యకు సరైన న్యాయం జరగాలంటే భారతరత్న ఇవ్వాల్సిందే అనే డిమాండ్ ఇప్పుడు వినిపిస్తోంది. కోట్లాది మంది ప్రజల గుండెల్లో నిలిచిన త్రివర్ణ పతాకాన్ని అందించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి భారత ప్రభుత్వం ఇవ్వగల ఏకైక సముచితమైన నివాళి భారతరత్న మాత్రమేనంటూ కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.