ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న మూడు కీలక ఘటనలకు సంబంధించి ఇప్పటికే కేసులు నమోదై, పోలీసులు విచారిస్తున్న మూడు కేసుల్ని ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మూడు కేసుల్లో చంద్రబాబు ఇంటిపై దాడి, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కు ఉన్నాయి. ఈ మూడు కేసుల్లో పోలీసులు జరుపుతున్న దర్యాప్తుపై ప్రభుత్వం పూర్తిగా సంతృప్తిగా లేదు. దీంతో వీటిని సీఐడీకి బదలాయించింది.
చంద్రబాబు ఇంటిపై దాడి, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, కాదంబరీ జెత్వానీ వేధింపులు ఈ మూడు కేసుల్లోనూ వైసీపీ పెద్దలు కీలక సూత్రధారులుగా ఉన్నారు. వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ మూడు వ్యవహారాల్లోనూ క్షేత్రస్ధాయిలో వైసీపీ నేతలు, ఐపీఎస్ అధికారులు, ఇతర పోలీసు అధికారులు పనిచేశారు. దీంతో వీటి అసలు తీగ లాగాలంటే సీఐడీకి బదిలీ చేస్తేనే మేలని ప్రభుత్వం భావించింది. త్వరలో సీఐడీ ఈ మూడు కేసులనూ టేకోవర్ చేయబోతోంది.