ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేదెవరన్న ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే అనిపిస్తోంది. సరిగ్గా నెల రోజుల క్రితం వరకూ అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసుగా చెప్పుకున్న ఈ పోరు కాస్తా ఏకపక్షంగా మారిపోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు కారణం తాజాగా పెన్సిల్వేనియాలో ట్రంప్ పై జరిగిన గన్ ఫైర్ మాత్రమే కాదు. అంతకు ముందే ట్రంప్ కు విజయం ఖాయమైపోయిందన్నది అమెరికన్ల మాట. మరి ఈ ట్రంప్ వేవ్ వెనుక ఏం జరిగిందన్న కథా కమామీషు ఓసారి చూసేద్దాం..
నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన డొనాల్డ్ ట్రంప్.. ఆ ఓటమిని తట్టుకోలేక యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ పైకి తన అనుచరుల్ని ఉసిగొల్పి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ట్రంప్ ఆ రోజు చేయించిన దాడి అమెరికా ప్రజాస్వామ్యంపైనే అన్న ప్రశ్నలు లేవనెత్తింది. అంతే కాదు పదుల సంఖ్యలో కేసుల్లో ఇరుక్కున్న ట్రంప్ రాజకీయ జీవితం ఇక క్లోజ్ అయిపోయిందన్న చర్చకు కారణమైంది. ఓ దశలో సోషల్ మీడియా దిగ్గజాలైన ట్విట్టర్, ఫేస్ బుక్ లు సైతం ట్రంప్ అకౌంట్లను కూడా బ్లాక్ చేసేశాయి. ఆ దశలో ఇంకొకరు అయితే ఇక రాజకీయాలకు టాటా చెప్పేసి వ్యాపారాలు చూసుకునేవారు. కానీ ట్రంప్ అలా చేయలేదు.
తన వాయిస్ ను జనంలోకి పంపేందుకు ట్రూత్ సోషల్ పేరుతో ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు ట్రంప్. ఓవైపు కేసులు ఎదుర్కొంటూనే మరోవైపు జనంలోకి బైడెన్ సర్కార్ తప్పిదాల్ని తీసుకెళ్లారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వంటి అంశాల్లో బైడెన్ సర్కార్ తప్పటడుగుల్ని జనంలోకి తీసుకెళ్లి అమెరికా ఫస్ట్ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. గాడి తప్పిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధను లక్ష్యంగా చేసుకుని పదే పదే విమర్శలు గుప్పించారు. కానీ వీటిలో దేనికీ బైడెన్ వద్ద సమాధానం లేదు. అదే ట్రంప్ కు వరంగా మారింది. తిరిగి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ నామినీగా ఎంపికయ్యారు.
వాయిస్ 3: ఇక్కడే ట్రంప్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి పలువురు పోటీ పడినా వారెవరూ ట్రంప్ కు సరితూగే వారు కాకపోవడంతో ఆయనకు ఎదురేలేకుండా పోయింది. ఆ తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తో జరిగిన టీవీ డిబేట్ లో ట్రంప్ చెలరేగిపోయారు. బైడెన్ తడబాటు, ఆయన వృద్ధాప్యం వంటి కారణాలతో సొంత పార్టీ డెమోక్రాట్లలోనే ఆయన అభ్యర్ధిత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగని మరో అభ్యర్ధిని ఇప్పటికిప్పుడు ఎంచుకోలేని పరిస్దితి. వెరసి ఇవన్నీ రిపబ్లికన్ అభ్యర్ధిగా ట్రంప్ నామినేషన్ ను ఖరారు చేసేసాయి. చివరిగా పెన్సిల్వేనియాలో ట్రంప్ పై జరిగిన కాల్పులు ఆయన పట్ల సానుభూతిని విపరీతంగా పెంచేశాయి. దీనికి తోడు భారతీయ మూలాలున్న ఉషా చిలుకూరి భర్త, ఓహియో సెనేటర్ జేడీ వాన్స్ ను తన డిప్యూటీగా ఎంచుకున్నారు. ఈ పరిణామాలు ట్రంప్ పట్ల అక్కడి భారతీయుల్లో సానుకూలత తెచ్చాయి.
ఇవన్నీ ఇప్పుడు ట్రంప్ ను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోక తప్పని పరిస్ధితి అమెరికన్లకు తెచ్చిపెట్టాయి. అంతే కాదు…తనపై దాడి తర్వాత పిడికిలి బిగించి ఫైట్ నినాదం చేయడం..అదే సమయంలో దేశ జెండా నేపథ్యంగా ట్రంప్ ఉన్న ఫోటో హిస్టరీ క్రియేట్ చేయడం వంటి పరిణామాలు ట్రంప్ కు అదనపు మైలేజ్ ను సంపాదించి పెట్టాయి. ఏదైనా ఊహించని పరిణామాలు జరిగితే తప్ప..ఇప్పుడు ట్రంప్ విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యమన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది.