పూరీ రత్నభాండార్ రహస్యం వీడినట్లేనా ? ప్రధాని పంతం నెరవేరినట్టేనా?

ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో ఉన్న 12 వ శతాబ్దం నాటి జగన్నాధుని గుడిలోని రత్న భాండార్ తలుపులు 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్నాయి. 11 మంది సభ్యుల రాష్ట్ర ప్రభుత్వ కమిటీ దీన్ని తెరిచి అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ చేసిన రత్నభాండార్ రహస్యం ఆరోపణల నిగ్గు తేల్చినట్లయింది. అయితే వీటి లెక్కింపు పూర్తయితే కానీ పూర్తి రహస్యం బయటపడేలా కనిపించడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో పూరీ రహస్యాల పై mega 9 స్పెషల్ ఫోకస్..

పూరీ జగన్నాధుని ఆలయంలో రత్నభాండాగారంపై గత ఎన్నికలకు ముందు ఎవరికీ పెద్దగా తెలియలేదు, తెలిసినా ఆసక్తి లేదు. అయితే ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఈ రత్న భాండాగారాన్ని ఎప్పటిలాగే బీజేపీ మార్కు అజెండాలో భాగంగా తెరపైకి తెచ్చారు. ఆరేళ్లుగా ఈ రత్న భాండాగారం తాళాలు కనిపించకపోయినా బీజేడీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇందులో ఉన్న అపార సంపదను వెలికితీసేందుకు ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించారు. ఎవరి కోసం దీన్ని దాచి ఉంచుతున్నారంటూ ప్రధాని హోదాలో మోడీ వేసిన ప్రశ్న ఓటర్లలో ఉత్కంఠ పెంచింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఇదో కీలకాంశంగా మారిపోయింది. సీన్ కట్ చేస్తే బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది.

తాము అధికారంలోకి వస్తే పూరీ రత్నభాండార్ తలుపులు తెరిచి సంపదను లెక్కించి ప్రజలకు చెప్తామని బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీని నెల రోజుల్లోనే నిలబెట్టుకుంది. దీంతో గత ఆదివారం రత్నభాండార్ తలుపులు తెరుచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 11 మంది సభ్యుల కమిటీ రత్నాభాండార్ లోకి ప్రవేశించింది. ఇందులో ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిశ్వనాథ్ రాత్, శ్రీ జగన్నాథ ఆలయ కమిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీ, ఏఎస్ఐ సూపరింటెండెంట్ డీబీ గడానాయక్, పూరీ నామమాత్రపు రాజు ‘గజపతి మహారాజా’ ప్రతినిధి కూడా ఉన్నారు. అలాగే నలుగురు ఆలయ సేవకులు పట్జోషి మోహపాత్ర, భండార్ మెకప్, చధౌకరణ, డ్యూలికరణ్ కూడా ఉన్నారు.

రత్న భాండార్‌లో శతాబ్దాలుగా భక్తులు, పూర్వపు రాజులు విరాళంగా ఇచ్చిన తోబుట్టువుల దేవతల విలువైన ఆభరణాలు, జగన్నాథుడు, సుభద్ర, బలభద్ర ఉన్నాయి. వీటిని బయటి గది, లోపలి గదిగా విభజించారు. పూరీ జగన్నాధుని వార్షిక రథయాత్రలో బంగారు వస్త్రధారణ వంటి సందర్భాలలో 12వ శతాబ్దపు మందిరపు బయటి గది తెరవబడినా..చివరిసారిగా 1978లో ఖజానా లెక్కింపు జరిగింది. తిరిగి ఇప్పుడు లెక్కించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖజానాలో నిధికి పాములు కాపలాగా ఉన్నాయని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని తేలిపోయింది. అలాగే ఓ ఖజానా గది తలుపు అందుబాటులో ఉన్న తాళాలతో తెరుచుకోకపోవడంతో పగులగొట్టి లోపలికి వెళ్లారు. అనంతరం అక్కడి అభరణాలు స్ట్రాంగ్ రూమ్ కు మార్చారు.

ఆదివారం పూర్తి ఖజానా నిధి స్ట్రాంగ్ రూమ్ లకు మార్చడం సాధ్యం కాకపోవడంతో మరో రోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించి వాయిదా వేశారు. ఇప్పటివరకూ జరిగిన నిధి వెలికితీత మొత్తం వీడియో చిత్రీకరణ చేశారు. మొత్తం నిధి స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాక మాత్రమే లెక్కింపు జరుగుతుంది. అనంతరం వీటి వాస్తవ లెక్కలు, విలువ వెల్లడవుతాయి. అయితే బీజేపీ ఎన్నికల హామీ మేరకు పూరీ జగన్నాధ రత్నభాండార్ తలుపులు తెరుచుకోవడంతో ప్రధాని మోడీ పంతం నెగ్గినట్లయింది. కానీ వేల కోట్లు విలువ చేసే వజ్ర, వైడూర్యాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మరికొద్దిరౌజులు వేచి చూడాల్సిందే…

Add Your Heading Text Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *