బెజవాడలో బుడమేరు వరద ముంచెత్తిన తర్వాత ఎక్కడ చూసినా చంద్రబాబు, మంత్రి నారాయణ హడావిడే కనిపించింది. ఆ తర్వాత క్రమంగా మరో మంత్రి నారా లోకేష్ కనిపించడం మొదలైంది. ఆ తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించడం లేదనే మాట వినిపించింది. కానీ క్షేత్రస్దాయిలో సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు తిరుగుతుంటే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు ఆ తర్వాత క్రమంగా సమాధానాలు దొరికేశాయి.
విజయవాడ వరద సహాయక చర్యల్లో తెరముందు చంద్రబాబు, నారాయణ, రామానాయుడు వంటి మంత్రులు కనిపిస్తుంటే.. తెరవెనుక ఉండి నడిపించిన మరో ఇద్దరు కీలక మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్. క్షేత్రస్ధాయిలో తిరగడం కన్నా తెరవెనుక ఉండి వ్యూహాలు రచించడం, వాటిని పక్కాగా అమలు చేయించడంలో వీరిద్దరూ సక్సెస్ అయ్యారు. ఈ విషయం వారి చుట్టూ ఉన్న అధికార గణానికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా వీరిద్దరి వ్యూహాల వల్లే విపత్తుల శాఖ, జలవనరులశాఖ స్పందన జనంలో పాజిటివ్ స్పందన తీసుకొచ్చింది.
క్షేత్రస్ధాయిలో తిరుగుతున్న సీఎం చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులకు అవసరమైన సమాచారం అందించడం, వారికి అవసరమైన వ్యూహాల్ని రచించడం, వాటిని అధికారుల సాయంతో అమలు జరిగేలా సమీక్షలు నిర్వహించడంలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ వరద ప్రాంతాలకు వెళ్లడం లేదన్న విమర్శలు ఎదుర్కొన్నా … దానికి సమాధానంగా తెరవెనుక అంతకంటే ఎక్కువగా శ్రమించారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ నిర్వహించిన సమీక్షల ఫలితాల ప్రభావం కొన్ని రోజులుగా క్షేత్రస్ధాయిలో కనిపిస్తోంది.
మరోవైపు మంత్రి నారా లోకేష్ అన్ని శాఖలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ తెరవెనుక నుంచే అధికారుల్ని నడిపించారు. అక్కడితే ఆగకుండా అవసరమైన సమయంలో బుడమేరు గండి పడిన ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ కూడా అధికారుల్ని పరుగులు తీయించారు. దీని ఫలితంగా బుడమేరుకు పడిన మూడు గండ్లు రెండు రోజుల వ్యవధిలోనే పూడ్చగలిగారు. ఇప్పుడు విజయవాడను వరదల నుంచి గట్టెక్కించడంలో తెరవెనుక యువమంత్రులు పవన్, లోకేష్ పోషించిన పాత్రను చంద్రబాబు సైతం అంతర్గత సమీక్షల్లో గుర్తుచేసుకుంటున్నారు.