2022లో బ్రిటన్ రాజకీయ వ్యవహారాలు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ చుట్టూ ముసురుకున్న వివాదం అంతా ఇంతా కాదు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం, సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా పావులు కదపడంతో ఏకంగా ప్రధాని పదవి నుంచే వైదొలగాల్సి వచ్చింది. అయితే బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడానికి రిషి సునాక్ కూడా ఓ కారణమని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ రాసిన ‘అన్ లిష్ డ్’.. బుక్ బ్రిటన్ రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది. త్వరలో యూకేలో విడుదల కానున్న ఈ బుక్ లో తన రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకొచ్చిన బోరిస్.. ఎన్నో విషయాలపై, వివాదాలపై కూలంకుషంగా ప్రస్తావించారు. మరి ముఖ్యంగా రిషి సునాక్ ను ఉద్దేశించి అయన బుక్ లో ప్రస్తావించిన తీరు పాశ్చాత్య దేశంలో మంట పుట్టిస్తోంది. అంతే కాకుండా మోడీ గురించి కూడా తన బుక్ లో ప్రత్యేకంగా రాసుకొచ్చారు బోరిస్.. మరి ఆయన మోదీ గురించి ఏమన్నారు? రిషి సునాక్ ను బోరిస్ జాన్సన్ ను విలన్ లా చూడడానికి కారణం ఏంటి? ఇంతకీ ‘అన్ లిష్ డ్’ బుక్ లో ఏముంది?
2022 వరకు బ్రిటన్ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్.. ఆ ఏడాదిలో అనుకోకుండా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆ తరువాత ఆ దేశ రాజకీయ స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఆ టైంలో బ్రిటన్ తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడిందనే చెప్పాలి. ఈ వివాదం ముదురుతున్న క్రమంలోనే కన్జర్వేటివ్ పార్టీ నుంచి కూడా వైదొలగరాయన. దీంతో అదే పార్టీకి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే బోరిస్ జాన్సన్ ను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి వెనకుండి పావులు కదిపింది రిషి సునాక్ అనే వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. బోరిస్ కూడా రిషి విషయంలో ఉప్పు, నిప్పులాగే ఉంటూ వచ్చారు. అయితే ఆ టైంలో రిషిపై కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు సానుకూలంగా ఉండడంతో బోరిస్ వ్యాఖ్యలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇకపోతే ఈ ఏడాది జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పై కీర్ స్టార్మర్ విజయం సాధించి యూకేకు కొత్త ప్రధాని గా ఎన్నికయ్యారు.
ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని రిషి సునాక్ పై బోరిస్ జాన్సన్ తాను రాసిన పుస్తకంలో కీలక విషయాలు వెల్లడించాడు. 2022లో తనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయని, కానీ అవేవి తనను బాధించలేదని పేర్కొన్నాడు. అయితే సొంత పార్టీలో రిషి సునాక్ తనకు వెన్నుపోటు పొడిచాడని, సొంత పార్టీలోని నేతలంతా తనకు వ్యతిరేకంగా మారడానికి ప్రధాన కారణం రిషి సునాకే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇదిలా ఉంచితే మన ప్రధాని మోదీ గురించి కూడా తన బుక్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు బోరిస్ జాన్సన్. భారత ప్రధాని మోదీ ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని.. ఆయనను కలిసినప్పుడల్లా ఎంతో నేర్చుకున్నానని తన బుక్ లో ప్రస్తావించాడు. అంతే కాకుండా మోడీ లాంటి వ్యక్తి ప్రపంచానికి ఎంతో అవసరమని.. ఆయన నుంచి ఇతర దేశ ప్రధానులు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇలా ఇండియాతో ఉన్న సంబంధం గురించి, మోడీతో ఉన్న అనుబంధం గురించి అనేక విషయాలను తన బుక్ లో పంచుకున్నారు బోరిస్ జాన్సన్.. ప్రస్తుతం ఈ బుక్ యూకేలో హాట్ టాపిక్ అవుతోంది. మరి అన్ లివ్ డ్ బుక్ బ్రిటన్ లో ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.