ఏపీలో కీలకమైన నెల్లూరు జిల్లాలో రాజకీయాల్ని గత ఎన్నికలు సమూలంగా మార్చేశాయి. అంతకు ముందు ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్షంగా పట్టం గట్టిన ఈ జిల్లాను ఈసారి టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా ఎంపీ వేమిరెడ్డి ఎంట్రీతో వైసీపీ నుంచి మొగ్గు టీడీపీకి మారిపోయింది. అదే సమయంలో వేమిరెడ్డితో పాటు టీడీపీ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన ముఖ్య అనుచరుడికి మాత్రం ఇప్పటివరకూ న్యాయం జరగలేదు. ఆయనెవరో ఇప్పుడు చూద్దాం..

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్య కారణం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే అని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ జోనల్ చైర్మన్ వంటేరు వేణుగోపాల్ రెడ్డి గతంలో పలుమార్లు చెప్పుకున్నారు. అయితే జిల్లాలో వైసీపీ నుండి ఇలా జంప్ చేసిన తన తోటి వాళ్ళకి, చిన్న స్థాయి నాయకులకు కూడా నామినేటెడ్ పోస్టులు వస్తుంటే వంటేరు వేణుగోపాల్ రెడ్డికి మాత్రం రెండు విడతల్లోనూ చంద్రబాబు మొండిచేయి చూపారు.
వంటేరు వేణుగోపాల్ రెడ్డి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలియని వారు లేరు. గతంలో కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి.. అప్పట్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్న సమయంలో వారి సమస్య తీర్చారు. అలాగే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గానూ రాణించారు. రెండు దఫాలు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరుకు సీఎం చంద్రబాబు వద్ద వేణు అని సంబోధించే చనువు కూడా ఉంది. అయినా పదవులకు వచ్చే సరికి మొండిచేయి తప్పడం లేదు.
2019లో టీడీపీని వీడి వైసీపీలో చేరిన వంటేరు వేణుగోపాల్ రెడ్డికి.. అక్కడా తగిన గుర్తింపు లభించింది. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గత ఎన్నికలకు ముందు వైసీపీ రాజ్య ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో వంటేరు కూడా ఆయన వెంట నడిచారు. వైసీపీ బుజ్జగింపుల్ని లెక్కచేయకుండా వేమిరెడ్డితోనే పయనించారు. అలాగే వేమిరెడ్డితో పాటు కావలి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న కావ్య కృష్ణారెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. అయినా టీడీపీ అధిష్టానం ఆయనకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు. వేమిరెడ్డి తల్చుకుంటే వంటేరుకు పదవి పెద్ద సమస్యే కాదన్న చర్చ నడుస్తోంది. ఈ నేపధ్యంలో సంక్రాంతికి ప్రకటించే మూడో విడత పోస్టుల్లో అయినా వంటేరుకు న్యాయం జరగాలని అనుచరులు కోరుతున్నారు.