పల్నాడులో అడ్డగోలుగా మద్యం షాపులు..

పల్నాడులో అడ్డగోలుగా మద్యం షాపులు..
కన్నెత్తి చూడని అధికారులు..

పల్నాడు జిల్లాలో పలు వైన్ షాపుల నిర్వహణ తీరు విమర్శలకు దారితీస్తోంది. అడుగడుగునా నిబంధనలకు తూట్లు పొడుస్తూ అడ్డుగోలుగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంస్థలు, దేవాలయాలు,ప్రార్ధనా మందిరాలకు సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయరాదని ప్రభుత్వం రూల్ పెట్టినా..దాన్ని పట్టించుకోవడం లేదు. విషయం తెలిసినా ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చాక అన్ని జిల్లాల్లోనూ మద్యం దుకాణాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు జారీ చేసింది. కానీ పల్నాడు జిల్లాలో మాత్రం ఇవేవీ అమలు కావడం లేదు. జిల్లాలో కొన్ని మద్యం షాపులు బార్ అండ్ రెస్టారెంట్లను తలపిస్తున్నాయి. పర్మిట్ రూమ్ పేరుతో భారీగా బార్ లను తలపించేలా ఏర్పాటు చేసిన ఈ మద్యం షాపులతో యువత త్వరగా మద్యానికి అలవాటు పడే ప్రమాదం ఉందంటున్నారు ప్రజా సంఘాల నాయకులు.

ఇక 18ఏళ్ళ లోపు వయసు వారికి మద్యం అమ్మకూడదనే నిబంధననూ అస్సలు పట్టించుకునే వారే లేరు. కొన్ని చోట్ల అధికధరలకు మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నా పట్టించుకోవట్లేదు. చాలా వరకు మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి అధికారులను సైతం తమ చెప్పుచేతులలో పెట్టుకుంటున్నారనే విమర్శలూ లేకపోలేదు. విద్యాసంస్థలు, ఆలయాలు, ప్రార్ధనా మందిరాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా షాపులు ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ తెలిసిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ళ మత్తులో పడి అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక బెల్టుషాపుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఊరూరా వాడవాడలా ఏర్పాటు చేసిన బెల్టు షాపుల లో మద్యం ఏరులై పారుతోంది. కొన్ని గ్రామాలలో ఎవరు బెల్టుషాపు నిర్వహించాలో కూడా సాక్ష్యాత్తూ ఎక్సైజ్ అధికారులే దగ్గరుండి నిర్ణయిస్తున్నారు. వారు చెప్పిన వారు కాకుండా వేరెవరైనా మద్యం వ్యాపారం చేస్తే వారిపై కేసులు పెట్టి వేధించడం, వారి వద్ద నుండి అందినకాడికి పిండుకోవడం చేస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు జోక్యం చేసుకుని అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *