రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు పశు పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. వాతావరణ మార్పులు, అంటువ్యాధుల కారణంగా అకస్మాత్తుగా గొర్రెలు , మేకలు చనిపోతే.. ఆ పెంపకందారుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఒక్కో జీవం చనిపోతే వేలాది రూపాయల నష్టం వస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గొల్ల, కురుమలకు, పెంపకందారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గొర్రెలు, మేకల బీమా పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. కరీంనగర్ జిల్లా వేదికగా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం మొదటి మహాసభ లో మంత్రులు ఈ బీమా పథకానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి, పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం లెక్కలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రతి గొర్రె లేదా మేకకు సంవత్సరానికి బీమా ప్రీమియం మొత్తం 88 రూపాయలు అవుతుంది. అయితే ఇందులో పెంపకందారుడు తన వాటాగా కేవలం 13 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 75 రూపాయల ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా బీమా కంపెనీలకు చెల్లిస్తుంది. ఇలా కేవలం 13 రూపాయలు కట్టి బీమా చేయించుకుంటే.. ఒకవేళ ఏదైనా కారణం చేత గొర్రె లేదా మేక చనిపోతే, రైతుకు పరిహారంగా ఏకంగా 3,000 రూపాయల బీమా సొమ్ము అందుతుంది. జీవాలను నమ్ముకున్న రైతుకు ఇది ఒక పెద్ద ఆసరాగా మారనుంది.
పశు పెంపకం దారుల కష్టాలు కళ్లారా చూసిన స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు.. పెంపకందారుల సమస్యలను మంత్రి వాకిటి శ్రీహరి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ, ప్రభుత్వ చిత్తశుద్ధితోనే ఇంత తక్కువ ప్రీమియంతో ఈ బీమా పథకం సాకారమైందని యాదవులు, కురుమ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు, మేకలకు బీమా రక్షణ – పెంపకందారులకు ఆర్థిక భరోసా అనే నినాదంతో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పలు కీలక హామీలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలకు సంబంధించిన పాత రుణ బకాయిలను పూర్తిగా మాఫీ చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, గొల్ల కురుమలు తమ కుల వృత్తులను కాపాడుకుంటూనే, తమ పిల్లల చదువుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఉన్నత చదువులు చదివించి తర్వాతి తరాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మంత్రులు పిలుపునిచ్చారు.జీవాలకు బీమా చేయడం ఎంత ముఖ్యమో, ఆ జీవాలను నమ్ముకుని బతుకుతున్న ఆ మనుషులకు, అంటే ఆ గొర్రెల కాపరులకు బీమా కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే అడవుల్లో, గుట్టల్లో తిరిగేటప్పుడు పాము కాటుకు గురైనా, లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినా ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందుకే ప్రభుత్వం జీవాలకే కాకుండా పెంపకందారులకు కూడా ఒక భారీ భరోసా ఇవ్వబోతోంది. అదే ఇందిరమ్మ బీమా పథకం. వృత్తిదారులకు సంక్షేమం అందించాలనే ఉద్దేశ్యంతో, రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ బీమా పథకాన్ని తీసుకురాబోతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.