మలేషియా వస్తున్న భారత ప్రయాణికులకు కౌలాలంపూర్ లోని భారత హైకమీషన్ కీలక అడ్వైజరీ జారీ చేసింది. 30 రోజుల వీసా-ఫ్రీ సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాల కోసం మలేషియాకు వస్తున్న భారతీయ పౌరుల సంఖ్య గణనీయంగా పెరిగిందని టూరిస్ట్ వీసాలపై మలేషియాకు వెళ్లే భారతీయ పౌరులు అక్కడ ఎలాంటి ఉద్యోగాలు చేయవద్దని కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ హెచ్చరించింది. నకిలీ ఉద్యోగ హామీలతో మోసపూరిత ఏజెంట్ల వల్ల చాలామంది భారతీయ పౌరులు మోసపోతున్నారు; దీనివల్ల గడువు ముగిసినా అక్కడే ఉండటం (overstay), అక్రమ నివాస హోదా, దోపిడీ, నిర్బంధం మరియు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. ఇది ఇమ్మిగ్రేషన్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఎందుకంటే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు 30 రోజుల వరకు మలేషియాలో ఉండేందుకు అనుమతించే ఈ వీసా-ఫ్రీ ఎంట్రీ సౌకర్యం కేవలం పర్యాటకం మరియు సామాజిక సందర్శనల కోసం మాత్రమే ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది. మలేషియా వచ్చేటప్పుడు కొన్ని కీలక విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి ఇమ్మిగ్రేషన్ సమస్యలు రాకుండా ఉండటానికి, నిజమైన పర్యాటకులు చెల్లుబాటు అయ్యే మరియు సంబంధిత డాక్యుమెంట్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొంది. అందులో కన్ఫర్మ్ అయిన రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ వివరాలు, మలేషియా చేరుకునే తేదీకి 3 రోజుల ముందు ‘మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్’ (MDAC) ఆన్‌లైన్ సమర్పణ, కనీసం 6 నెలల చెల్లుబాటు వ్యవధి ఉన్న పాస్‌పోర్ట్ వంటి వాటిని చెక్ చేసుకోవాలని సూచించింది. వర్క్ పర్మిట్ లేదా వీసా విత్ రెఫరెన్స్ (VDR) లేకుండా పని / ఉద్యోగ నిమిత్తం మలేషియాకు ప్రయాణించవద్దని భారతీయ పౌరులకు ఖచ్చితంగా సూచించింది. కాబట్టి సరైన ధ్రువపత్రాలు లేకుండా అలాగే ఏజెంట్లను నమ్మి వర్క్ పర్మిట్ వీసా లేకుండా అక్కడికి వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోవద్దని స్పష్టం చేసింది.