సినీ, బుల్లితెర ఇండస్ట్రీలకు గుడ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Spread the love

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ, బుల్లితెర ఇండస్ట్రీలకు గుడ్ న్యూస్ చెప్పింది. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో సినీ,టీవీ రంగాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే  ‘నంది అవార్డుల’ను అందించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఈ అవార్డులకు సందడి మళ్లీ మొదలుకాబోతోంది. సినీ, టెలివిజన్ రంగాల్లో ప్రతిభ చాటిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే ఈ నంది పురస్కారాల పునరుద్ధరణపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇండస్ట్రీ నుండి సంతోషం వ్యక్తమవుతోంది. ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా వివిధ కారణాలతో నంది అవార్డుల నిర్వహణ నిలిచిపోయింది. అప్పటి నుండి కళాకారులు, నిర్మాతలు, దర్శకులు నంది అవార్డుల పునరుద్ధరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కళాకారుల గౌరవాన్ని, కళా రంగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిలిచిపోయిన ఈ పురస్కారాలను పునఃప్రారంభించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. నంది అవార్డుల పునరుద్ధరణకు సంబంధించి ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) చైర్మన్ పి. భరత్ భూషణ్ కీలక అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సినీ మరియు టీవీ రంగాలకు చెంది నంది పురస్కారాలను మళ్లీ ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం టాలీవుడ్ మరియు టెలివిజన్ వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. 

ఈ ప్రకటనలోని గమనించాల్సిన అంశం ఏమిటంటే పెండింగ్‌లో ఉన్న కాలానికి సంబంధించి పూర్తిస్థాయిలో అవార్డులను ప్రదానం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 2017 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న కాలానికి సంబంధించి పురస్కారాలు ఇవ్వనున్నారు.  ఈ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి భేదాలు లేకుండా, కేవలం అర్హత, ప్రతిభ ఆధారంగానే విజేతలను ఎంపిక చేస్తామని ఛైర్మన్ స్పష్టం చేశారు.అవార్డుల నిర్వహణ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన అన్ని కేటగిరీల దరఖాస్తులకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు మరియు నిర్మాణ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఈ వేడుకలను గతంలో కంటే అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టెలివిజన్ రంగానికి కూడా ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతనిచ్చింది. టెలివిజన్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకను ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. మొత్తానికి నంది అవార్డుల పునరుద్ధరణతో ఆంధ్రప్రదేశ్‌ లో మళ్లీ సాంస్కృతిక, సినీ వాతావరణం నెలకొనబోతోందని పలువురు ఆ రంగానికి చెందిన వారి నుండి అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *