ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..ఈసారి  ఓటరు మహాశయుడి తీర్పు ఎలా ఉంటుందో?

Spread the love

దేశంలో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 824 అసెంబ్లీ స్థానాలు.. 17 కోట్ల మంది ఓటర్లు ఇలా ఒక మినీ దేశవ్యాప్త సమరానికి పార్టీలు రెడీ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో ఎన్నికల హడావుడి షురూ అయ్యింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషీతో కలిసి ఢిల్లీలో వివరాలు వెల్లడించారు. బెంగాల్‌లో 294 స్థానాలకు ఏప్రిల్‌ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 23న ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 9న ఒకే దశలో పోలింగ్‌ జరగనుండగా…అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్‌ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్‌ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. వీటి ఓట్ల లెక్కింపు కూడా మే 4న జరుగుతుంది.

ఇక ఎన్నికల కౌంట్ డౌన్ మొదలవడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయ వేదికపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. దశాబ్ద కాలానికి పైగా అప్రతిహతంగా సాగుతున్న మమతా బెనర్జీ పాలనకు ఈసారి ఎలాంటి సవాలు ఎదురుకాబోతోంది. అక్కడ గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా నిలిచిన బీజేపీ ఈసారి ఆమెను అధికారం నుండి దించుతుందా? ప్రజలు ఏ తీర్పును ఇవ్వనున్నారు. ఇన్నాళ్లూ అక్కడ తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌ కు ఈసారి గెలుపు అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకుల అంచనా. మమతా బెనర్జీ ప్రభుత్వంపై గతంలో ఎన్నడూ లేనంతగా వ్యతిరేకత కనిపిస్తోంది.  ఒకప్పుడు బెంగాల్‌లో నామమాత్రంగా ఉన్న బీజేపీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా పటిష్టంగా కనిపిస్తోంది. అమిత్ షా వ్యూహాలు, క్షేత్రస్థాయిలో బలం పుంజుకున్న  కేడర్ టీఎంసీకి గట్టి సవాలునే విసురుతున్నాయి. బెంగాలీ సెంటిమెంట్‌ మమతకు కొంత ఎడ్వాంటేజీ అయినప్పటికీ నేషనలిజం,  కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి , లా అండ్ ఆర్డర్, అక్రమ చొరబాటు అంశాల్లో బీజేపీ ఓటర్లను ఆకర్షించడంలో ముందుంది. టీఎంసీకి ఇది కీలక సవాలే. కేంద్ర ప్రభుత్వ పెద్దలు బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇన్ని సవాళ్లు ఉన్నా.. మమతా బెనర్జీకి ఉన్న అతిపెద్ద బలం ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు. ‘లక్ష్మీర్ భండార్’ వంటి పథకాలు మహిళా ఓటర్లను భారీగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలా సంక్షేమ పథకాలతో క్షేత్రస్థాయిలో ఉన్న లబ్ధిదారులు మళ్ళీ మమత సర్కార్  వైపే మొగ్గు చూపుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక తమిళనాడు రాజకీయాలకు వస్తే ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ప్రస్తుతం మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటోంది. ఒకవైపు సంక్షేమ పథకాల జోరు కనిపిస్తున్నా, మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో నిత్యావసర ధరల పెరుగుదల , మౌలిక సదుపాయాల కొరత సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇక బీజేపీ వంటి జాతీయ పార్టీలు రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుండటం, అన్నాడీఎంకే బలాబలాలు, కొత్త రాజకీయ పార్టీల  ఆవిర్భావం మధ్య స్టాలిన్ ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి. జరుగుతున్నది ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలేనప్పటికీ  వీటి  ఫలితాలు కేవలం రాష్ట్రాలకే పరిమితం కాకుండా రానున్న రోజుల్లో సరికొత్త రాజకీయ సమీకరణాలకు కీలకంగా మారే అవకాశం ఉంది.  మరి సామాన్య ఓటరు తన హక్కుతో ఏ నిర్ణయాన్ని వెల్లడిస్తాడనేది వేచి చూడాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *