సమాజంలో జరుగుతున్న ఒక మార్పుపై సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. సమాజంలో విడాకులు పెరగడానికి, బంధాలు విడిపోవడానికి కారణాలపై ఆమె స్పందించారు. మారుతున్న అనుబంధాలు, పెరుగుతోన్న విడాకుల కేసులపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వ్యామోహం, అవసరానికి మించి స్మార్ట్ఫోన్ల వాడకం ప్రభావం గురించి మాట్లాడారు. మనుషుల మధ్య ఉండాల్సిన స్వచ్ఛమైన అనుబంధాలపై సోషల్ మీడియా తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది అని ఆమె అభిప్రాయపడింది. ఒకప్పుడు ఇంట్లో భార్యాభర్తలు పక్కపక్కన కూర్చుంటే ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకునేవారు. కానీ ఇప్పుడు ఫోన్ల కారణంగా దంపతుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు పూర్తిగా తగ్గిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రీల్స్ లో మునిగిపోతున్నారు ఒకరి మనసులో ఒకరు ఏముందో అని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదన్నారు. ఈ సోషల్ మీడియా వ్యామోహం వల్లే ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం తగ్గిపోయిందని, దానివల్లే బంధాల్లో దూరాలు పెరుగుతున్నాయన్నారు.
చాలా మంది కపుల్స్ రెస్టరంట్లు, డిన్నర్ డేట్లకు వెళ్లినప్పుడు కూడా ఎదురెదురుగా కూర్చుని కూడా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటూ ఫోన్లకే పరిమితం అవుతున్నారు అని కాజల్ తన అనుభవాన్ని పంచుకుంది. ఒక రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు, అక్కడ ఒక మంచి ఫొటో తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దానికి ఎన్ని లైక్స్ వచ్చాయి అని చెక్ చేసుకోవడం మీదే ధ్యాస ఉంటోంది తప్ప, పక్కన ఉన్న జీవిత భాగస్వామితో హాయిగా నాలుగు మాటలు మాట్లాడటం లేదని అన్నారు. ఆమె తన భర్త గౌతమ్ కిచ్లుతో ప్రతి వారం ఫోన్-లేని డిన్నర్ డేట్ ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నట్లు చెప్పారు. కొత్తగా పెళ్లైన దంపతులకు కాజల్ ఒక మంచి సలహా ఇచ్చింది. సోషల్ మీడియా వ్యామోహం నుంచి, ఈ వర్చువల్ ప్రపంచం నుంచి త్వరగా బయటపడండి. భాగస్వామితో, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం అలవాటు చేసుకోండి అని ఆమె సూచించింది. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు, పక్కన ఉన్న రియల్ పర్సన్ ను ప్రేమించడం నేర్చుకోండి అని ఆమె ఇచ్చిన ఈ మెసేజ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇక కాజల్ అగర్వాల్ ప్రొఫెషనల్ కెరీర్, సినిమాల విషయానికొస్తే.. పెళ్లి తర్వాత కూడా ఆమె ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా వరుస సినిమాలు చేస్తోంది. కమల్ హాసన్ తో ఇండియన్ 2, బాలకృష్ణతో భగవంత్ కేసరి, సత్యభామ లాంటి సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించింది. ఇటీవల ఆమె ది ఇండియా స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా జియోహాట్స్టార్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక పక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క తన పర్సనల్ లైఫ్ ను అద్భుతంగా బ్యాలన్స్ చేసుకుంటున్న కాజల్ అగర్వాల్ నిజజీవితంలో కూడా ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలుస్తోంది.