భారత స్టార్ షట్లర్ సింధు ..500 విజయాలతో అరుదైన ఘనత 

Spread the love

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు  మరో ఘనతను తన పేరిట లిఖించుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ లో 500 మ్యాచ్ లలో విజయాలు సాధించిన ఆరో ప్లేయర్ గా అవతరించింది. ఈ మైలురాయిని అందుకున్న మొదటి భారత షట్లర్ గా నిలిచింది. మహిళల సింగిల్స్ లో సింధు కంటే ముందు ఇంతానన్ థాయిలాండ్ కు చెందిన  రచనోక్,చైనీస్ తైపీకి చెందిన  తై జు యింగ్,జపాన్ షట్లర్  అకానె యమగూచి, స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ ,బల్గెరియా క్రీడాకారిణి  పెత్యా నెదెల్చెవా మాత్రమే 500 విజయాలు నమోదు చేశారు. డబుల్స్ మ్యాచ్ లను కూడా చూస్తే సింధు ఖాతాలో మొత్తం 516 విజయాలున్నాయి. ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 మ్యాచ్ లో గెలిచి క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించడమే కాకుండా ఈ అరుదైన ఘనతను అందుకుంది. తాజాగా జరిగిన ప్రీ క్వార్టర్స్ లో సింధు 21-19, 21-18 తో డెన్మార్క్ కు చెందిన  లైన్ హోయ్మార్క్ పై విజయం సాధించింది. ఇక పురుషుల సింగిల్స్ లో మరో స్టార్ షట్లర్  లక్ష్యసేన్ క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్స్లో లక్ష్యసేన్ 21-10, 21-11తో హంగ్ కాంగ్ కు చెందిన  జేసన్ గునవాన్ పై గెలిచాడు. కిదాంబి శ్రీకాంత్ 11-21, 10-21తో చైనీస్ తైపీకి చెందిన చౌ తీన్ చెన్ చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల సింగిల్స్ లో అన్మోల్ ఖరబ్ 21-16, 6-15 (రిటైర్డ్)తో జపాన్ షట్లర్  నొజొమి ఒకుహర  చేతిలో ఓడింది.  పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో హరిహరన్- అర్జున్ జోడీ 17-21, 21-9, 16-21తో మలేసియా ద్వయం వీ చాంగ్- వున్ తీ చేతిలో పోరాడి ఓటమి చెందింది.