మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన వైశాఖ పౌర్ణమి నేడు!

Spread the love

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పౌర్ణమి తిథికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక సంవత్సరంలో వచ్చే నాలుగు పూర్ణిమలు శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనవి. అవి మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ. పౌర్ణమినాటి నక్షత్రం ఆధారంగానే మనం నెలలను ఏర్పరుచుకున్నాం. ఈ నెల 12న వైశాఖ శుద్ధ పూర్ణిమ సందర్భంగా జాతకంలో దుష్ప్రభావాలను తొలగించుకునేందుకు ఎలాంటి పూజలు, పరిహారాలు చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు గంగానదీ స్నానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే ఈరోజు చేసే దాన ధర్మాలకు, పూజలకు కోటిరెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రవచనం తెలుపుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే శని, బృహస్పతి గ్రహాల అనుకూలత, ప్రభావం మంచిగా ఉండాలి. వైశాఖ పౌర్ణమిరోజు రావి చెట్టును పూజిస్తే శని, బృహస్పతులు అనుగ్రహించి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.

రావి చెట్టు పూజ..
తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి, రావి చెట్టుకు నీళ్లు పోసి, చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే రావి చెట్టులో నివసించే ముక్కోటి దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంతోషించి పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు.

  • సూర్యోదయ సమయంలో రావి చెట్టుపై పితృదేవతలు నివసిస్తారట. అందుకే ఆ సమయంలో రావి చెట్టుకు నీళ్లు కలిపిన పాలు, నల్ల నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా పెడితే పితృదేవతల అనుగ్రహంతో సకల శ్రేయస్సు, వంశాభివృద్ధి కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. *జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలు ఉన్నట్లయితే సూర్యాస్తమయం సమయంలో రావి చెట్టుకు నీరు పోసి, నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే, శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • సూర్యోదయం తరువాత రెండు ఘడియలు పూర్తయ్యాక రావి చెట్టులో శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుంది. ఆ సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆవు నేతితో దీపారాధన చేస్తే దారిద్య్ర బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

వైశాఖ పౌర్ణమిని బుద్ధజయంతిగా కూడా వ్యవహరిస్తారు. ఈరోజు బుద్ధునికి మహా ప్రీతికరమైన రోజు. ఆయన జననం నుంచి బుద్ధుడిగా మారడం, నిర్యాణం చెందడం వరకు మూడూ క్రతువులు కూడా ఈ పౌర్ణమినాడే జరిగాయని చెబుతారు. అందుకే బౌద్ధులకు, ఆయనను ఆరాధించే సకలజీవులకు ఈరోజు పరమపవిత్రమైన రోజు.

ఒక సంవత్సరంలో వచ్చే నాలుగు పూర్ణిమలు శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనవి. అవి మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ. అందులో ఈ నెల 12న వచ్చిన వైశాఖ పౌర్ణమి విష్ణుభక్తులకూ పరమ పవిత్రం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం ఈరోజునే ఉద్భవించింది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మథించే సమయంలో, కవ్వంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశిష్టమైన ఈ కూర్మావతాన్ని పూజించేందుకు ఆలయాలు మన దగ్గర చాలా అరుదుగా ఉన్నాయి.

  • వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణుభక్తులైన ఆళ్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్‌ జన్మించాడు.
  • వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునేనట. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతార రూపం.. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరచి, శాంతింపచేసేందుకు శరభేశ్వరుడు ప్రత్యేకంగా అవతరించాడు. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభరూపం మనకు తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈ రోజు విశిష్టమైనది.

తెలుగు సంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి ముఖ్యమైనది. ఈ రోజును మహావైశాఖిగానూ పిలుస్తారు. ఈరోజున వీలైతే సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు. ఎండ ఉధృతంగా ఉండే ఈ కాలంలో దధ్యోజనం (పెరుగన్నం), గొడుగు, ఉదకుంభం (నీటితో నిండిన కుండ) లాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు.

సాధారణంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు శుభకార్యాలు విశేషంగా జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు మొదలు పెట్టే ముందు రావి చెట్టును తప్పక పూజించి ప్రదక్షిణలు చేసిన తర్వాత శుభకార్యాలు ప్రారంభిస్తే అట్టి కార్యాలలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయని విశ్వాసం.