అతిపెద్ద క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే జట్లలో ఒకటైన లక్నో సూపర్ జయంట్స్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. లక్నో సూపర్ జయంట్స్ (LSG) ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు రిషబ్ పంత్ కోరారని, ఆయన అభ్యర్థనను ఫ్రాంచైజీ తక్షణమే ఆమోదించిందని అధికారికంగా తెలిపింది. రిషబ్ ఈ అభ్యర్థనతో ఫ్రాంచైజీని సంప్రదించారు, మేము దానిని గౌరవపూర్వకంగా అంగీకరించాము. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ సులభం కాదు. కెప్టెన్‌గా రిషబ్ ఈ డ్రెస్సింగ్ రూమ్‌కు అందించిన ప్రతిదానికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా దృష్టి ఇప్పుడు జట్టు ప్రయోజనాలపైనే ఉందని పేర్కొంది. ఇక అత్యుత్తమ ప్రమాణాలను అందుకోవడానికి జట్టును తిరిగి నిర్మించడం మరియు పునర్వ్యవస్థీకరించడంపైనే తాము దృష్టి పెడుతున్నట్లు తెలిపింది.
ఈ ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జయంట్స్ (LSG) ప్రదర్శన అంత ఆశాజనకంగా సాగలేదు. మంచి అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ, జట్టు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో టోర్నీ నుండి నిష్క్రమించింది. ఆ జట్టు 14 లీగ్ మ్యాచ్ లలో కేవలం 4 విజయాలు సాధించి 10 పరాజయాలతో పేలవప్రదర్శన కనబరిచింది. జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ పంత్ రికార్డు కూడా ఈ సీజన్లో అంత గొప్పగా ఏమీ లేదు. అటు కెప్టెన్ గా స్ట్రాటజీలు ఫలించకపోవడం, ఇటు బ్యాటర్‌గా తన మార్కు డాషింగ్ ప్రదర్శన లేకపోవడం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే పంత్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలుస్తోంది. ఇక రిషబ్ పంత్ లాంటి స్టార్ ఆటగాడు కెప్టెన్సీకి దూరం కావడం తన అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే అయితే జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2026 ఐపీఎల్ సీజన్లో, రిషబ్ పంత్ లక్నో సూపర్ జయంట్స్ తరఫున 14 ఇన్నింగ్స్‌ల్లో (14 మ్యాచ్‌ల్లో) 24.00 యావరేజ్ మరియు 138.05 స్ట్రైక్ రేట్‌తో 312 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఆయన ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. 68 పరుగులతో నాటౌట్ గా నిలవడం అత్యధిక స్కోరుగా నమోదైంది. అలాగే ఈ సీజన్ లో 11 సిక్సర్లు బాదాడు. 2025 ఐపీఎల్ వేలంలో పంత్ ను లక్నో ప్రాంఛైజీ ఏకంగా రూ.27 కోట్లతో తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.