లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు ఏంటో తెలుసా..?!

Spread the love

భారతీయ హిందూ సనాతనధర్మంలో ప్రతి ఇల్లు, ఇల్లాలు తమ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని కోరుకుంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే ఆర్థికంగా ఏ లోటు ఉండదు. అయితే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బును సమకూర్చే దేవత మాత్రమే కాదు.. మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మికత పురోగతిని కూడా ప్రసాదించే దేవత!

సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారంగా పిలుస్తాం. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తాం. అయితే లక్ష్మీదేవికి పూజ చేసే క్రమంలో ఆమెకు ఇష్టమైన పువ్వులతో ఆరాధిస్తే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుందిట.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తామర పువ్వు.. అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆమె తామర పువ్వులో ఆసీనురాలై దర్శనమిస్తుంది. బురదలో వికసించే తామర పువ్వు ఎంతో పవిత్రమైనది. అందుకే పూజలో కమలాన్ని సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. తామర పువ్వును సమర్పించడం వల్ల ధన సంబంధిత సమస్యలు తొలగిపోయి.. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. వైవాహిక జీవితం కూడా అన్యోన్యంగా సాగిపోతుంది.

మల్లె పువ్వులు.. కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సువాసనభరితమైన పువ్వులంటే ఆ అమ్మకు ఎంతో ప్రీతి. తెలుపు రంగు స్వచ్ఛతను, శాంతిని సూచిస్తుంది. వీటిని సమర్పించడం వల్ల కుటుంబంలో ప్రేమ, సామరస్యం పెరుగుతుంది. చేపట్టే పనుల్లో విజయం చేకూరుతుంది.

గులాబీ పువ్వులు.. కూడా లక్ష్మీదేవికి ఇష్టం. ఆ అమ్మ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉంచితే సంతోషిస్తుంది. ఎరుపు గులాబీలు ఒకవైపు శక్తిని మరొక వైపు ప్రేమను కురుపిస్తాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి తిరిగి రాకుండా ఇబ్బందులు పడేవారు ఎరుపు గులాబీలతో లక్ష్మీదేవిని అర్చిస్తే డబ్బులు తిరిగి వస్తాయట. మానసిక ఒత్తిడి దూరం అయి.. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగుతాయి.

బంతిపువ్వు.. భారతీయ పూజలలో, ప్రతి పర్వదినాన గుమ్మాలకు.. ఇంట్లో ప్రత్యేక కళను తెచ్చే, చాలా ప్రాధాన్యత కలిగి ఉన్న ఈ బంతిపూలు.. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. దుష్టశక్తులు తొలగిపోయేలా చేస్తుంది. విద్యార్థులు చదువులో రాణించాలన్నా లక్ష్మీదేవికి బంతిపువ్వులతో పూజ చేయాలి.

మొగలి పువ్వు.. ఇది వాసనకు ప్రసిద్ధి. లక్ష్మీదేవికి ఎంతగానో ప్రీతి. మొగలిపువ్వును లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల తొందరగా ప్రసన్నురాలవుతుంది.

మందారం.. ఎరుపు రంగు మందారం పువ్వు శక్తికి, శ్రేయస్సుకు, అదృష్టానికి చిహ్నం. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీ పూజలో మందారం పువ్వులు సమర్పిస్తే అనుగ్రహం పొందుతారు. తల్లిని కొలిచే భక్తులకు, సంపద, శ్రేయస్సు, ఆనందం, శాంతిని ప్రసాదిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తీ అయ్యేలా చేస్తుంది. వ్యాపారాలలో వృద్ధి ఉంటుంది.

పూజలో ఎల్లప్పుడూ తాజాగా ఉన్న పువ్వులు, సువాసనగల పువ్వులను మాత్రమే సమర్పించాలి.
పువ్వులను అమ్మవారికి సమర్పించే ముందు గంగాజలంతో తప్పక శుద్ది చేయాలి. ఏ దేవతకైనా ఏ పువ్వును అయినా సమర్పించేముందు ఆ దైవ నామం జపిస్తూ పువ్వులు సమర్పించాల్సి ఉంటుంది.