తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలందరూ తమ తమ స్టైల్‌లో విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్న ఈ సమయంలో అక్కినేని నాగార్జున మాత్రం కొంతకాలంగా పెద్ద కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా, క్లాస్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్న నాగార్జున, ఇప్పుడు తన కెరీర్‌లో కీలకమైన దశలో ఉన్నారు. ఇక అదే సమయంలో సీనియర్ అగ్రహీరోలు నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’తో రికార్డులను తిరగరాశారు. ఇక ఈ ఏడాది వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’లో కీలక పాత్ర పోషించి మరో విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రంలో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా కాలం తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
అయితే నాగార్జున లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు అని ఫాన్స్ గట్టి నమ్మకం. తన ఇమేజ్‌ను పక్కనబెట్టి ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తారు. ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’లో, అలాగే ధనుష్ ‘కుబేర’ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. కానీ ఆ సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు అందరి చూపు కింగ్ వందవ చిత్రంపై నిలిచింది. ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఒక మైలురాయి కావడంతో ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసిన కథతో ముందుకు వస్తున్నారు. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కర్ణాటకలోని మైసూర్‌లో జరుగుతుంది. అక్కడి చారిత్రక కట్టడాల నేపథ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మైసూర్ ప్యాలెస్ వంటి అద్భుతమైన లొకేషన్లు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశముంది. అందుకే ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే: చాలా కాలం తర్వాత టబు నాగార్జునతో కలిసి నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. అలాగే యువ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుందని టాక్. ఈ తరహా కాంబినేషన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
అక్కినేని కుటుంబానికి ‘మనం’ సినిమా ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. అఖిల్ కూడా అతిథి పాత్రలో మెరిశాడు. ఇప్పుడు నాగార్జున వందవ సినిమా కావడంతో ఆయన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కూడా అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే అభిమానులకు ఇది పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. మొత్తానికి, నాగార్జున కెరీర్‌లో ఇది ఒక కీలక చిత్రం. వందవ సినిమా అనే మైలురాయి మాత్రమే కాదు, ఆయన మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఇది ఒక మంచి అవకాశం. అభిమానులు కూడా ఈ సినిమాపై పెద్ద ఆశలు పెట్టుకున్నారు.