ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై అసలు రాజీ పడేదే లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా, పోలవరం-నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్షించారు. ఇరిగేషన్ రంగానికి గతంలోనూ ఇప్పుడూ విశేష ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్నిపునరుద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఝంఝావతి రబ్బర్ డ్యాం కొట్టుకుపోయింది. గత ప్రభుత్వంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ దెబ్బతినేలా చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ కు రిపేర్లు చేసినా సరిపోతుందని నిపుణులు నివేదికలు ఇచ్చినా, నాణ్యత విషయంలో, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ సమీక్షలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.