గత కొద్దిరోజులుగా వంటగ్యాస్ కొరత సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. హోటళ్లు మూతపడటం, ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఖతార్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్‌తో బయలుదేరిన ‘నందాదేవి’ నౌక, గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు క్షేమంగా చేరుకుంది. నిన్ననే ‘శివాలిక్’ నౌక రాగా, నేడు ‘నందాదేవి’ కూడా చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సరఫరా పుంజుకోనుంది. త్వరలోనే ఇళ్లకి, హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ సాధారణ స్థితికి రానుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో నెలకొన్న ఎల్పీజీ కొరతను తీరుస్తూ.. ఖతార్ నుండి భారత్‌కు భారీగా గ్యాస్ నిల్వలు చేరుకుంటున్నాయి. ఖతార్ నుంచి బయలుదేరిన ‘నందాదేవి’ అనే భారీ షిప్ 9 రోజుల ప్రయాణం తర్వాత సురక్షితంగా భారత్ చేరుకుంది. ఈ నౌకలో ఏకంగా 46,000 టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఈ విషయాన్ని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా స్వయంగా తెలిపారు. వరుసగా వస్తున్న ఈ షిప్స్ వలన గ్యాస్ కొరత తీరి, సామాన్యులకు ఊరట దక్కనుంది.
భారత ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా సుదూర తీరాల నుండి భారీ నౌకలు స్వదేశానికి చేరుకున్నాయి. ‘శివాలిక్’ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరింది. ఇక ఈ నౌకతో పాటు మరో నౌక కలిపి మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్ కు తీసుకొచ్చాయి.అయితే ఈ ప్రయాణం అంత సులభం ఏమీ కాదు. ప్రస్తుతం అత్యంత ఉద్రిక్తతలతో కూడిన హార్ముజ్ జలసంధిని దాటి ఇక్కడి వరకు రావడం పెద్ద సవాలే. అయితే ఇరాన్ అనుమతి ఉంటేనే ఈ మార్గంలో నౌకల ప్రయాణం సాధ్యమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్‌తో కొనసాగిస్తున్న సన్నిహిత దౌత్య సంబంధాలతో ఇది సాధ్యపడింది. భారత్ తో తనకు ఉన్న అనుబంధం దృష్ట్యా ఇరాన్ భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గతంలో సిలిండర్లు దొరకవేమో అన్న భయంతోప్రజలు భారీగా బుకింగ్స్ చేశారు. ఫలితంగా రోజువారీ బుకింగ్స్ ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఇప్పుడు నిల్వలు పుష్కలంగా ఉండటంతో ఆ ఆందోళన తగ్గింది. ప్రస్తుతం బుకింగ్స్ కూడా క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సరఫరా స్థిరంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలోనే గ్రామాల్లో గ్యాస్ వెయిటింగ్ పీరియడ్‌ను 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించే అవకాశం ఉంది.
అయితే ఎల్పీజీ సమస్యలు ఇంకా పూర్తిగా పోయినట్లు కాదు. గల్ఫ్ దేశాల వైపున మరో 22 భారత నౌకలు ఆగిపోయి ఉన్నాయి. వాటిలో 6 ఎల్పీజీ గ్యాస్ నింపుకున్న నౌకలు కూడా ఉన్నాయని రాజేశ్ కుమార్ సిన్హా తెలిపారు. ఇరాన్ అనుమతి ఇస్తే వాటిని ఇండియాకి తెచ్చుకోవచ్చు. ఐతే.. ఇరాన్ ఒకేసారి అనుమతి ఇవ్వకుండా.. ఒక్కొక్కటిగా ఇస్తోంది. ఇక ఈ నౌకలను సురక్షితంగా ఇండియాకి తెచ్చేందుకు భారత నౌకాదళం యుద్ధ నౌకలను సిద్ధంగా ఉంచింది.ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ మాట్లాడుతూ, భారత్ మాకు మంచి మిత్రదేశం, కాబట్టి భారత నౌకలకు మేం రక్షణ కల్పిస్తామని ప్రకటించారు.
అలాగే కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ‘జగ్ లాడ్కీ’ అనే భారీ నౌక ఇవాళ ఇండియాకి వస్తోంది. అదైతే ఏకంగా 80,000 మెట్రిక్ టన్నుల ముర్బాన్ క్రూడ్ ఆయిల్‌ని తీసుకొస్తోంది. అది నేడు ముంద్రా పోర్టుకు చేరుకుంటోంది. ఇక దేశవ్యాప్తంగా గ్యాస్ హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. ఇక త్వరలోనే మరో 6 ఎల్పీజీ (LPG) నౌకలు భారత్‌కు చేరుకోనున్నాయి. ఇవి వస్తే గ్యాస్ సంక్షోభం పూర్తిగా తొలగిపోనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ‘ప్రజలెవరూ కంగారు పడవద్దని ఆందోళనతో సిలిండర్లను నిల్వ చేయవద్దని ఆయన కోరారు.