విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవుని చెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని క్వాలిటీని పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం క్వాలిటీపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు తెలిపారు. ఇటీవల మధ్యాహ్న భోజనం అంశంపై జరిగిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. భోజనం బాగాలేకపోతే ముందు తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఆ తర్వాత భోజనం నాణ్యతపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం సరిగా లేదంటూ ఆహారాన్ని విద్యార్థులు డస్ట్ బిన్ లో పడేసిన ఘటనపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని, నిర్లక్ష్యంగా ఎవరూ వ్యవహరించవద్దని లోకేష్ హెచ్చరించారు. భోజనం నాణ్యతపై ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలో టీచింగ్ తీరు, పాఠశాల పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాన్ని లోకేష్ పరిశీలించి విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని, అంగన్ వాడీ కేంద్రం పరిశుభ్రతను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.