సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంలో కమీషనర్ సజ్జనార్ ముందుంటారు. కాగా, సోషల్ మీడియాలో యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఒక కీలక పోస్ట్ పెట్టారు. క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
“ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు.” అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు.. నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చని హెచ్చరించారు. ఆ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలని మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లేనని అప్రమత్తం చేశారు. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయి.
ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడుదమని వీడియో కాల్ చేస్తే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్‌మెయిలింగ్ సెక్స్‌టార్షన్ కు దిగుతారని హెచ్చరించారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడవద్దని వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.