పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’ ఇప్పటికే భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిన చిత్రం. పురాణాలు, ఫ్యూచర్ వరల్డ్, విజువల్ గ్రాండియర్ అన్ని కలిసి రూపొందిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్ హైప్ లభించింది. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘కల్కి పార్ట్-2’ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి, భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేశారు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లలో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, హీరో ప్రభాస్ షూటింగ్‌లో ఇంకా పాల్గొనకపోయినా, ఇతర ముఖ్య పాత్రలతో సంబంధించిన సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌లో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, అలాగే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ పాల్గొంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముగ్గురు నటులు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారని ఇప్పటికే తెలిసిన విషయమే. అందుకే వీరి పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ముందుగా పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు దర్శకుడు జె.డి.చక్రవర్తి కూడా ‘కల్కి పార్ట్-2’లో కీలక పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ సెట్స్‌లో ఆయన ఇటీవల జాయిన్ అయ్యారని సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. జె.డి. చక్రవర్తి తన నటనతో తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ముఖ్యంగా గంభీరమైన పాత్రలు, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన చూపే నటనకు మంచి పేరు ఉంది. అలాంటి నటుడు ‘కల్కి’ వంటి భారీ ప్రాజెక్టులో చేరితే ఆయన పాత్ర కూడా కథలో కీలకంగా ఉండే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.