ఈరోజు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా పాలకులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక ఈ సందర్భంగా భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. భద్రాచలం ఆలయాన్ని మూడు దశల్లో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం రూ.586 కోట్లతో ప్రణాళికలు రెడీ చేశారు. అందులో భాగంగా తొలి దశలో రూ.351 కోట్లతో చేపట్టనున్న పనులకు సీఎం రేవంత్ శ్రీరామనవమి సందర్భంగా భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు.