నేపాల్ కొత్త ప్రధానిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) పార్లమెంటరీ పార్టీ నేత బాలేన్ షా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం బాలేన్ షాను ఆ పదవిలో నియమించినట్లు నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ఎన్నికైన నేపాల్ ప్రధానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మిస్టర్ బాలేంద్ర షా గారికి హృదయపూర్వక అభినందనలు. నేపాల్ ప్రజలు మీ నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి మీ నియామకం ఒక నిదర్శనం. మన రెండు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనం కోసం, భారత్-నేపాల్ స్నేహాన్ని మరియు సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి వారితో కలిసి సన్నిహితంగా పనిచేయాలని ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇక బాలేన్ షా గురించి చెప్పుకోవాలంటే మార్చి 5న జరిగిన ఎన్నికల్లో, ఆర్‌ఎస్‌పీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేయగా, 275 స్థానాలున్న ప్రతినిధుల సభలో 182 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. తూర్పు నేపాల్‌లోని ఝాపా-5 నియోజకవర్గంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై బాలెన్ షా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఓలీకి 18,734 ఓట్లు, షాకు 68,348 ఓట్లు వచ్చాయి.