ప్రభుత్వ బడులు విద్యార్థులతో మరింత కళకళలాడాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. పిల్లలను చేర్పించమంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు చేపట్టిన వినూత్న ప్రచారం ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ బడిలో చేరితే ఎన్ని ప్రయోజనాలో వివరిస్తూ పోస్టర్లు పంచుతున్నారని తమ బడిలో ప్రతిభావంతులైన పూర్వవిద్యార్థులు, వారు సాధించిన ఫలితాలతో కరపత్రాలు వేసి ప్రచారం చేస్తున్నారని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వివరిస్తూ..పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలి అంటూ కోరుతున్న అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, ఇతర సంస్థలకు అభినందనలు తెలిపారు. కొందరు ఉపాధ్యాయులు సోషల్ మీడియా వేదికగా పాఠశాలల ప్రవేశాలు పెంచేందుకు వినూత్నంగా చేస్తున్న ప్రచారం ప్రశంసనీయమని కొనియాడారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు సమాజంలో అన్ని వర్గాలూ సహకారం అందించాలని కోరారు. మన బడి పిలుస్తోంది..మన బడి కార్పొరేటుకి ధీటుగా నిలుస్తోంది.. సమగ్ర విద్యావికాసంలో మన బడి గెలుస్తోంది అంటూ లోకేష్ తన స్పందనను తెలియజేశారు.