రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నేడు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం నుండి విజయవాడ 70 కి.మీ, విజయవాడ నుండి గుంటూరు 40 కి.మీ.. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పినట్లు తెలిపారు. తాము ప్రాక్టికల్‌గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదని ప్లాన్-బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదని విమర్శించారు. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. దీని కోసం అమరావతిలో పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్లలో 10% ఇక్కడ పెట్టినా చాలు అని సరికొత్త సూచనను చేశారు. సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే.. రాయలసీమలోనే రాజధాని పెట్టేవాడినిని జగన్ అన్నారు. రాజధాని పరిసరాల్లో ఉండాలని చంద్రబాబు కంటే ముందే భూమి కొని ఇల్లు కట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఏడేళ్లు నువ్వు సీఎంగా ఉండి.. లక్ష ఎకరాల అమరావతిలో ఇప్పటి వరకు కట్టింది ఎంత అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఏ దేశానికి పోతే.. ఆ దేశం బొమ్మలు చూపిస్తూ ఇదిగో అమరావతి ఇలా ఉంటుందని చెప్తావు. కానీ ఆచరణలో అవి కనిపించవని ఎద్దేవా చేశారు. కనీసం అమరావతి రైతులకు ఇచ్చిన హామీలనైనా నెరవేర్చావా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు.. నిజాయతీ అంతకంటే లేదని విమర్శలు గుప్పించారు.